వరలక్ష్మి టిఫిన్స్‌ హోటల్‌లో డ్రగ్స్‌ కలకలం.. రూ.14 లక్షల డ్రగ్స్‌ సీజ్‌

హైదరాబాద్‌లోని వరలక్ష్మి టిఫిన్స్‌ సెంటర్‌ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గచ్చిబౌలి, డీఎల్‌ఎఫ్‌ వీధిలోని ఫుడ్‌ లేన్‌లోని ఈ హోటల్‌ గురించి భోజన ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా హోటల్‌ వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. హోటల్‌ ప్రారంభించిన అనతి కాలంలోనే.. ఎంతో పేరు సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ హోటల్‌లో డ్రగ్స్‌ వెలుగు చూడటం సంచలనంగా మారింది. సుమారు 14 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్‌ని పోలీసులు సీజ్‌ చేశారు.

ఈ కేసులో వరలక్ష్మి టిఫిన్స్‌ యజమానితో పాటు.. మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు.. 97,500 రూపాయల నగదు, 5 మొబైల్‌ ఫోన్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితురాలు డ్రగ్‌ పెడ్లర్‌ అనురాధ డబ్బు సంపాదన కోసం డ్రగ్స్‌ అక్రమ రవాణాను ఉపాధిగా ఎంచుకుంది. గత కొన్నాళ్లుగా ఆమె గోవా నుంచి అక్రమంగా నగరానికి డ్రగ్స్‌ రవాణా చేస్తుంది.

ఈ క్రమంలో అనురాధకి వరలక్ష్మి టిఫిన్స్‌ ఓనర్‌ ప్రభాకర్‌ రెడ్డి, పల్లెటూరి పుల్లట్లు ఓనర్‌ వెంకటతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా స్థానికంగా డ్రగ్స్‌ అమ్మకం ప్రారంభించింది. కొకైన్‌, ఎండీఎంఏ, ఎకాస్టసి పిల్స్‌ను అక్రమంగా అమ్మడం ప్రారంభించారు. వీరంతా మోకిలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలుసుకుని.. డ్రగ్స్‌ సరఫరా గురించి చర్చించుకునే వారని పోలీసులు తెలిపారు. ఇక తాజాగా డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించిన డీల్‌ జరుగుతుండగా.. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

Show comments