Tirupathi Rao
Dawood Ibrahim Crimes & biography: దావూద్ ఇబ్రహీం మనిషి కాదు.. నరరూప రాక్షసుడు. అతను చేయని నేరం లేదు. తీసిన ప్రాణాలకు లెక్కే లేదు.
Dawood Ibrahim Crimes & biography: దావూద్ ఇబ్రహీం మనిషి కాదు.. నరరూప రాక్షసుడు. అతను చేయని నేరం లేదు. తీసిన ప్రాణాలకు లెక్కే లేదు.
Tirupathi Rao
దావూద్ ఇబ్రహీం.. క్రైమ్ ని ఇండియాలో లీగల్ చేయాలి అన్నంతగా విధ్వంసాలు సృష్టించిన ఓ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, గ్యాంగ్‌స్టర్, అండర్ వరల్డ్ డాన్. దావూద్ చేసిన దారుణాలు తెలియాలంటే.. ముంబై క్రైమ్ బ్రాంచ్ లో దుమ్ము పట్టిపోయిన లెక్కకి మించిన ఫైల్స్ తిరగేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతను నెత్తురు రుచి మరిగిన పులి. చిన్నప్పుడు మనం విన్న కథల్లోని దెయ్యం అతడే, పిశాచి అతడే. ఇసుమంత కూడా మానవత్వం లేని నరరూప రాక్షసుడు అతనే. ఇలాంటి దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన సంచలన విషయం ఒకటి సోమవారం ఉదయం బయటికి వచ్చింది. ఇండియాలో అనేక దారుణాలకు పాల్పడిన అతను.. పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నట్లు అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే.. కరాచీలో ఉంటున్న దావూద్‌పై విష ప్రయోగం జరిగిందని, హుటాహుటినా ఆస్పత్రికి తరలించడంపై ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. అసలు ఇండియాలో పుట్టి పెరిగిన ఇతనికి పాకిస్థాన్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అండర్ వరల్డ్ డాన్‌గా దావూద్ ఇండియాలో ఎలాంటి నరమేధం సృష్టించాడు. అసలు అతని జీవితం ఎలా మొదలై.. ఎలా కొనసాగుతోంది? ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దావూద్ ఇబ్రహీం.. 1955, డిసెంబరు 26న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. ముంబై చీకటి సామ్రాజ్యానికి గాడ్ ఫాదర్ అయ్యాడు. 1974లో ముంబైలోని డోంగ్రీలో సృష్టించిన అల్లర్లతో తొలిసారి క్రైమ్ వరల్డ్‌లో దావూద్ పేరు మారుమోగిపోయింది. అప్పటికే అక్కడ డాన్‌గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద దావూద్ గోలీసోడాలతో దాడి చేశాడు. ఆపై హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీంలాలా వంటి డాన్‌లను పక్కకు నెట్టేసి ముంబైకి డాన్‌గా మారిపోయాడు. వినేందుకు సినిమా స్టోరీలా ఉన్నా.. దావూద్ ఇబ్రహీం పచ్చినెత్తురు తాగే రాక్షసుడితో సమానం. అతను చేసిన దారుణాలు కొన్ని వందల కుటుంబాలను రోడ్డున పడేలా చేశాయి.
చిన్న చిన్న గొడవలు, కత్తులతో హత్యల రేంజ్‌ను దాటి.. క్రైమ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన దుర్మార్గుడు. 1993లో ముంబైలో జరిగిన వరస పేలుళ్లుకు దావూదే సూత్రధారి. ఆ ఘటనలో ముఖ్యపాత్రధారిగా టైగర్ మెమోన్ ఉన్నాడు. 1993లో జరిగిన ఈ నరమేధంలో ఏకంగా 257 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 1400 మందికి పైగా ఆ బాంబ్ బ్లాస్ట్‌లో తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని వందల కోట్ల ఆస్తినష్టం జరిగింది. అంతకు ముందెన్నడూ ఇండియా ఇంత పెద్ద టెర్రరిస్ట్ ఎటాక్‌ను చూడలేదు. ఆ ఘటనతో ఒక్క ఇండియానే కాదు.. మొత్తం ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దారుణం తర్వాత దావూద్ ఇండియా వదిలి.. పాకిస్థాన్‌కు పారిపోయాడు. అయితే.. ఈ ఘటనకు ముందు కూడా డీ కంపెనీ పేరిట దావూద్ అనేక దారుణాలు చేశాడు.
ముంబై కేంద్రంగా మొత్తం ఇండియానే వణికించాడు. రాజకీయం, సినిమా, క్రికెట్, బిజినెస్.. ఇలా ప్రముఖ రంగాలు దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో ఉండేవంటే.. నమ్మడానికి కష్టంగా ఉన్నా.. అదే నిజం. ఓ దుర్మార్గుడుకి ఇంత పలుకుబడి ఎలా వచ్చింది అంటే.. అందుకు చాలా కారణాలు చెబుతుంటారు విశ్లేషకులు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాను దావూద్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని చెబుతుంటారు. అనేక సినిమాలకు పెట్టుబడి పెట్టి.. హీరో, హీరోయిన్లు తాను చెప్పినట్లు వినేలా చేసుకున్నాడు. తన పనులు అయ్యేందుకు.. హీరోయిన్లను అత్యంత దారుణంగా వాడుకునేవాడు. తనకు నచ్చిందనే కారణంగా మందాకినీ అనే ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీని తీసుకెళ్లిపోయాడు దావూద్. ఇలా.. ఒకటి కాదు రెండు కాదు.. చీకటి సామ్రాజ్యంలో దావూద్ ఇబ్రహీం అనేక నేరాలకు పాల్పడ్డాడు. క్రికెట్ బెట్టింగ్స్ వల్ల కొన్ని కోట్లు అక్రమంగా సంపాదించాడు దావూద్. ముంబై కేంద్రంగా అనేక నేరాలు చేసిన దావూద్.. 1993 ముంబై బ్లాస్ట్ తర్వాత.. పాకిస్థాన్‌కు పారిపోయి.. అక్కడి నుంచి కూడా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
అల్ ఖైదా, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో దావూద్ చేతులు కలిపి.. నరరూప రాక్షసుడిగా మారిపోయాడు. అల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్‌తో దావూద్‌కు సాన్నిహిత్యం ఉందని కూడా అమెరికా బయటపెట్టింది. దావూద్ ఒక్కడే కాదు.. అతని కుటుంబం మొత్తం దావూద్ నేర సామ్రాజ్యంలో పాత్ర దారులే.. దావూద్ భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. ఇంతటి దుర్మార్గుడిని తమ దేశంలో ఆశ్రయమిచ్చిన పాకిస్థాన్.. ఆ విషయాన్ని ఏనాడు ఒప్పుకోకుండా.. దావూద్ తమ దేశంలో లేడని బుకాయిస్తూ వస్తోంది. పాకిస్థాన్ కేంద్రంగా.. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్ లతోపాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌లలో దావూద్ తన డీ కంపెనీ కార్యకలాపాలు విస్తరించాడు.
1976లో దావూద్ ప్రారంభించిన ‘డి కంపెనీ’ 1982 నాటి ముంబై కార్మికుల సమ్మెతో నగరం స్వరూపాన్నే కాదు, మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది. ఆయుధాల రవాణా, హవాలా, దొంగనోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యల వరకు డీ కంపెనీ చేయని దారుణం లేదు. ఇలా ఒక సాధారణ కానిస్టేబుల్‌కు కొడుకుగా పుట్టిన దావూద్.. తప్పుడు మార్గాన్ని ఎంచుకుని.. ఎన్నో ప్రాణాలు తీసి.. ప్రస్తుతం ప్రాణ భయంతో బిక్కుబిక్కుమని బతుకుతున్నాడు. అతనికి విషం పెట్టారనే వార్త బయటికి రావడంతో ముంబైలో ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమాయకుల ప్రాణాలు తీసి బతికే బతుకూ ఓ బతుకేనా అంటూ.. దావూద్‌కు శాపనార్థాలు పెడుతున్నారు. మరి దావూద్ జీవితంతో పాటు అతనిపై విషప్రయోగం జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.