ఆలస్యంగా వచ్చాడని.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టారు!

డెలివరీ ఏజెంట్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ఉపాధి అవకాశం అయిపోయింది. ఎంతోమంది ఈ పని చేసుకుంటూ చాలా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా డెలివరీ బాయ్స్ లేకుండా ఇప్పుడు మన జీవితాన్ని ఊహించులోకేలని పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే గుండుసూది, సబ్బు బిళ్ల దగ్గరి నుంచి ఫుడ్, కూరగాయలు, గ్రాసరీస్ కూడా ఇప్పుడు ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్ కోసం ఈ సర్వీస్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాధారణంగా మీరు ఏదైనా ఆర్డర్ చేశాక.. డెలివరీ చేయడానికి కాస్త ఆలస్యం కావచ్చు.

అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? వచ్చే దాకా వెయిట్ చేస్తారు. వచ్చాక.. ఏంటి బ్రో ఇంత లేట్? అంటూ కాస్త చిరాకు పడతారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం.. తనకు డెలివరీ ఆలస్యంగా వచ్చిందని ఏకంగా మిత్రులతో కలిసి గదిలో బందించి కొట్టాడు. మొత్తం ఏడుగురు కలిసి ఆ డెలివరీ బాయ్ పై దాడి చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతని కాలు విరగొట్టినంత పని చేశారు. ఈ ఘటన అంతా జరిగింది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్  శివారులోనే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి పేరు షేక్ రహమాన్ ఫయాజ్. ఇతను మహారాష్ట్ లోని నాంధేడుకు చెందిన వాడు. బతుకుతెరువు కోసం పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్ కు వచ్చాడు. బోరబండలో నివాసముంటున్నాడు. గత ఆరు నెలలుగా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు.

ఆగస్టు 5న కుత్భుల్లాపూర్ కు చెందిన కేపీ విశాల్ గౌడ్ కు చెందిన వస్తువులు కొన్ని డెలివరీ చేసేందుకు ఫయాజ్ వెళ్లాడు. అయితే సిటీ అవుట్ స్కట్స్ కావడం.. అడ్రెస్ సరిగ్గా తెలియకపోవడంతో అతనికి డెలివరీ చేసేందుకు కాస్త ఇబ్బంది అయింది. స్థానికులను అడుగుతూ ఎలాగోలా అడ్రస్ కు చేరుకున్నాడు. అయితే ఎందుకు డెలివరీ ఆలస్యం అయిందని విశాల్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా అతని ఆరుగురు మిత్రులతో కలిసి ఫయాజ్ ను గదిలో బందించారు. అక్కడ అతనిపై క్రికెట్ బ్యాట్ వంటి వాటితో దాడి చేసినట్లు చెబుతున్నాడు. మరోవైపు కేసు నమోదు విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫయాజ్ తన మిత్రుల సాయంతో ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తున్నారు. కొందరి సాయంతో దాదాపు ఐదు రోజుల తర్వాత సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను కలిసినట్లు చెబుతున్నారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచనతో జీడిమెట్ల సీఐ కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ దాడిలో ఫయాజ్ కాలు విరిగిపోయింది అంటున్నారు.

Show comments