Venkateswarlu
Venkateswarlu
మనిషన్నాక కోరికలు ఉండటం సహజం. అవి ఏ కోరికలైనా సరే.. అయితే, వాటికంటూ ఓ లిమిట్ ఉంటుంది. మన కోరికలు మనల్ని విపరీతంగా డామినేట్ చేస్తే.. జీవితం చిక్కుల్లో పడుతుంది. ముఖ్యంగా శృంగార కోరికలకు సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొంతమందికి పిచ్చి పిచ్చి కోరికలు, ఫాంటసీలు ఉంటాయి. వాటిని తీర్చుకునే క్రమంలో విచక్షణ కోల్పోతూ ఉంటారు. చివరకు తమ పిచ్చి ఫాంటసీల కారణంగా ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. తాజాగా, ఓ వ్యక్తి అందర్నీ నగ్నంగా చూడ్డాలన్న ఉద్దేశంతో ఓ మ్యాజిక్ మిర్రర్ కొనాలనుకున్నాడు.
దాదాపు 9 లక్షల రూపాయలు పెట్టి మోసపోయాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన అవినాష్ కుమార్ శుక్లా అనే 72 ఏళ్ల వ్యక్తికి కొద్ది నెలల క్రితం ఆన్‌లైన్ ద్వారా పార్థా సింగరాయ్, మోలయ సర్కార్, సుదీప్త సింగరాయ్ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. తాము సింగపూర్‌లో ఉండే పురాతన వస్తువులను అమ్మే కంపెనీలో పని చేస్తున్నామని వారు అవినాష్‌కు చెప్పారు. ఓ రోజు మాటల సందర్భంలో తమ దగ్గర 2 కోట్ల రూపాయలు విలువ చేసే మ్యాజిక్ అద్దం ఉందని చెప్పారు.
దాని ద్వారా ప్రజల్ని నగ్నంగా చూడొచ్చని.. భవిష్యత్తు కూడా తెలుసుకోవచ్చని అన్నారు. దాన్ని అమెరికాకు చెందిన నాసా సంస్థ కూడా వాడిందని కూడా నమ్మబలికారు. అది నిజమేనని నమ్మిన అవినాష్ దాన్ని కొనడానికి సిద్ధమయ్యాడు. తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని బేరం ఆడాడు. వారు 2 కోట్లనుంచి కొంత కిందకు దిగారు. కొంత మొత్తానికి బేరం కుదిరింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ 9 లక్షల రూపాయలు ఆన్‌లైన్ ద్వారా వారికి పంపాడు. ఆ తర్వాత మ్యాజిక్ అద్దాన్ని తీసుకోవడానికి ఒరిస్సాలోని భుబనేశ్వర్ వెళ్లాడు.
ఓ హోటల్‌లో వారిని కలిశాడు. వారు అద్దం గురించి పొంతన లేని సమాధానాలు చెప్పటంతో అవినాష్‌కు అనుమానం వచ్చింది. అద్దాన్ని చెక్ చేయగా అది మ్యాజిక్ అద్దం కాదని తేలింది. దీంతో తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వాళ్లు డబ్బులు ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. తర్వాత మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు. తాను మోసపోయానని తెలుసుకున్న అవినాష్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.