Venkateswarlu
Venkateswarlu
తల్లిని మించిన దైవం ఇంకోటి ఉండదని అంటారు. తల్లి తనకి తినడానికి తిండి లేకపోయినా.. పిల్లల కడుపు నింపటానికే చూస్తుంది. అలాంటి తల్లిని చంపడానికి ఈ కొడుకుకి మనసు ఎలా వచ్చిందో ఏమో.. మందు కోసం తల్లిని పొట్టనపెట్టుకున్నాడు. కత్తితో ఆమెను అతి క్రూరంగా పొడిచి చంపాడు. అతడి పాపం పండి చివరకు జీవిత ఖైదీగా మారాడు. ఈ ఘటన ఎస్.ఆర్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఎస్ఆర్ నగర్‌కు చెందిన సంగీత(50) , సంతు (22) తల్లీ కొడుకులు. ఈ ఇద్దరు ఎస్. ఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. సంతుకి తండ్రి లేడు. సంగీత అన్నీ తానై సంతును పెంచింది. ఇక, ఈ ఇద్దరూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంతు మద్యానికి బానిసయ్యాడు. ప్రతీరోజు మందు తాగేవాడు. కూలీ పనుల డబ్బుల్ని మొత్తం తాగడానికే ఖర్చు చేసేవాడు. తన దగ్గర డబ్బులు లేకపోతే తల్లిని ఇబ్బంది పెట్టేవాడు. ఇలాగే కొద్ది నెలల క్రితం సంతు తాగడానికి తల్లిని 500 రూపాయిలు అడిగాడు.
సంగీత డబ్బులు ఇవ్వనని సంతుకి చెప్పింది. తల్లి తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో సంతు రెచ్చిపోయాడు. వాళ్ల ఇంటి తలుపుని మూశాడు. వంటగది నుంచి కత్తి తెచ్చి తల్లిని కడుపులో పొడిచాడు. దానితో ఆగకుండా ఓ మృగంలా మారి ఆమె కడుపుని చీల్చి పేగులు బయటకి తీశాడు. ఇదంతా గమనించిన ఇరుగుపొరుగు వాళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నించగా.. తలుపులు మూసి ఉండడంతో రాలేకపోయారు. వాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకుని సంతుని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, ఈ కేసుని విచారించిన కోర్టు సంతుకి జీవిత ఖైదుతో పాటు పది వేల రూపాయిల జరిమానా విధించింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.