iDreamPost
android-app
ios-app

చిత్తూరు వాసికి ఉరి శిక్ష! ఎంతటి పాపం చేశాడో తెలుసా?

చిత్తూరు వాసికి ఉరి శిక్ష! ఎంతటి పాపం చేశాడో తెలుసా?

దేశంలో దుర్మార్గులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు అత్యాచారం చేసి ఆపై హత్యలకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రోజుకో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. అచ్చం ఇలాగే దారుణానికి ఒడిగట్టిన ఓ వ్యక్తికి జిల్లా కోర్టు తాజాగా ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పును బాధిత కుటుంబ సభ్యులు స్వాగతిస్తున్నారు. ఇంతకు ఈ దుర్మార్గుడు చేసిన నేరమేంటో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా తంబళపల్లి మండలం గంగిరెడ్డిపల్లె గ్రామం. ఇదే ఊరిలో సయ్యద్ మౌలాలీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఈ వ్యక్తి ఇదే గ్రామానికి చెందిన సరళమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. కాగా మౌలాలీ, సరళమ్మ ఇద్దరు ఏదో విషయంపై గొడవ పడ్డారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన మౌలాలీ.. ప్రియురాలు సరళమ్మను దారుణంగా హత్య చేశాడు. అయితే ఉన్నట్టుండి సరళమ్మ కనిపించకపోవడంతో ఆమె తల్లి గంగులమ్మ నా కూతురు ఎక్కడా అంటూ మౌలాలీని ప్రశ్నించింది. దీంతో ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు మౌలాలీ ప్రియురాలి తల్లి గంగులమ్మను సైతం హత్య చేశాడు.

అలా కొన్ని రోజులు గడిచాక మృతురాలు సరళమ్మ కూతురు నా తల్లి ఎక్కడా అంటూ మౌలాలీని ప్రశ్నించింది. దీంతో ఈ దుర్మార్గుడు ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. అభం, శుభం తెలియని ఆ మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఇక ఎట్టకేలకు అసలు విషయం బయటపడడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సయ్యద్ మౌలాలీని అదుపులోకి తీసుకుని విచారించగా.. సరళమ్మ, ఆమె తల్లి గంగులమ్మను హత్య చేసి ఆమె మనవరాలిని అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడు.

దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 2021లో జరిగిన ఈ కేసుపై చిత్తూరు జిల్లా కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడు సయ్యద్ మౌలాలీకి ఉరి శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసుపై త్వరగా స్పందించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన న్యాయస్థానం తీర్పును బాధిత కుటుంబ సభ్యులు స్వాగతిస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇద్దరు మహిళలను హత్య చేసి మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఈ దుర్మార్గుడికి ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: బిర్యానీ కోసం ఫైటింగ్.. యువకుడిని కత్తులతో నరికి చంపిన దండగులు!