Warren Buffett: ఉన్నదంతా దానం ఇచ్చేస్తోన్న వారెన్‌ బఫెట్‌.. వేల కోట్ల సంపద

ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేల కోట్ల రూపాయలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ వివరాలు..

ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేల కోట్ల రూపాయలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ వివరాలు..

సమాజంలో చాలా మంది సంపదను పొగేసుకునే పనిలోనే ఉంటారు. తమ ముందు తరాల వారు కూడా కూర్చుని తినేంత సంపదను పొగేస్తారు. లక్షల కోట్లు సంపాదించిన సరే.. ఇంకా కావాలనుకుంటారే తప్ప.. ఇదంతా మనకు ఇచ్చింది సమాజం… మరి మన వంతుగా ఈ సంపద నుంచి కొంత ఆ సమాజానికి తిరిగి ఇచ్చేద్దాం అని ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగానే ప్రపంచ కుబేరులంతా ఇలా ఆలోచిస్తే.. మన సమాజంలో ఆకలి, నిరక్షరాస్యత, వైద్యం వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కానీ అందరికి అంత మంచి దాన గుణం ఉండదు. కానీ కొందరు కుబేరులు మాత్రం తమ సంపదలో అధిక భాగం సమాజ శ్రేయస్సుకే వినియోగిస్తుంటారు. ఇలాంటి దానకర్ణుల జాబితాలో వారెన్‌ బఫెట్‌ పేరు ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. తనకున్న సంపదనంతా దానం చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

బెర్క్‌షైర్ హతావే చైర్మన్‌, సీఈవో వారెన్‌ బఫెట్‌ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తన పేరు మీద ఉన్న సంపదనంతా దానం చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే రూ.44,200 కోట్లు దానం చేసేందుకు రెడీ అయ్యారు. ప్రపంచంలో 10వ అత్యంత సంపన్నుడైన బఫెట్‌ 5.3 బిలియన్ డాలర్ల విలువైన 1.3 కోట్ల బెర్క్‌షైర్ హతావే స్టాక్స్‌ను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు, నాలుగు కుటుంబ ఛారిటీలకు విరాళంగా ఇస్తున్నారు. 2006 తర్వాత ఇది ఆయన ఇస్తున్న అత్యధిక వార్షిక విరాళం.

సంపాదనకు, సంపదకు మారుపేరైన వారెన్ బఫెట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎక్కువ మందికి ఆయన ఓ ప్రపంచ కుబేరుడిగా మాత్రమే తెలుసు. ఆయన దాతృత్వం గురించి, విరాళాల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తాజాగా ప్రకటించిన విరాళంతో కలిపి స్వచ్ఛంద సంస్థలకు ఆయన ఇప్పటి వరకు అందించిన మొత్తం విరాళాలు 57 బిలియన్ డాలర్లకు (సుమారు 4.7 లక్షల కోట్లు) పెరిగాయి. గేట్స్ ఫౌండేషన్ కు బఫెట్ ఇప్పటివరకు 43 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బెర్క్ షైర్ షేర్లను విరాళంగా ఇచ్చారు.

గేట్స్ ఫౌండేషన్‌తో పాటుగా తన మొదటి భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు 9,93,035 షేర్లను, తన పిల్లలు హోవార్డ్, సుసాన్, పీటర్ నేతృత్వంలోని మూడు స్వచ్ఛంద సంస్థలకు కూడా 6,95,122 షేర్లను విరాళంగా బఫెట్‌ విరాళంగా ఇచ్చారు.

ఉన్నదంతా ఇచ్చేసే ఆలోచన

బెర్క్ షైర్‌లో 1965 నుంచి తాను నిర్మించిన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలని బఫెట్‌ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే  దీనికి సంబంధించిన వీలునామాను తయారు చేశారని..  ఆయన తదనంతరం బఫెట్‌ సంతానం ఈ వీలునామాని అమలు చేయనున్నారు. బెర్క్‌షైర్ సుమారు 880 బిలియన్‌ డాలర్ల సమ్మేళనం. ఇది బీఎన్ఎస్ఎఫ్ రైల్రోడ్, గీకో కార్ ఇన్సూరెన్స్, యాపిల్ వంటి స్టాక్స్‌తో సహా డజన్ల కొద్దీ వ్యాపారాలను కలిగి ఉంది.

Show comments