iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ ముగిసేలోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేకపోతే నష్టమే!

సెప్టెంబర్ ముగిసేలోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేకపోతే నష్టమే!

సెప్టెంబర్ నెల మొదలయ్యింది. ఈ నెలలో పౌరులు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. నెలాఖరులోగా ఆ పనులు చేయకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పథకాలు ఏ ఆటంకం లేకుండా పొందాలన్నా, వ్యాపార వాణిజ్యాలు కొనసాగించాలన్నా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మీ పనులు సవ్యంగా జరిగిపోతాయి లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఏయే పనులు చేయాలి? చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? ఆ వివరాలు మీ కోసం..

ఆధార్ కార్డ్ ఉచితంగా అప్‌డేట్:

గత కొన్ని నెలలుగా ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఎఐ సూచిస్తుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంది. కానీ పూర్తి స్థాయిలో ఆధార్ అప్ డేట్ జరుగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆధార్ ఉచితంగా అప్ డేట్ చేసుకోవడానికి మరో అవకాశం కల్పిస్తూ సెప్టెంబర్ 14 వరకు తుది గడువును విధించింది. తుది గడువు తర్వాత ఆధార్ అప్ డేట్ చేసుకునే వారికి ఛార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపింది.

రూ. 2000 నోట్ల మార్పిడి..

మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. ఈ తేదీ లోగా రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడమో లేక మార్పిడి చేసుకోవడమో చేయాలి. అలా చేయకపోతే సెప్టెంబర్ 30 తర్వాత రూ. 2000 నోట్లు చెల్లవు. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని గడువులోగా నోట్లను మార్పిడి చేసుకుంటే మేలు.

డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లకు నామినేషన్

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారు, ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఉన్నవారు తప్పనిసరిగా నామినీ వివరాలు అందించాలి. ఈ పని చేయడానికి ఆఖని గడువును సెప్టెంబర్ 30 వరకు సెబీ విదించింది.

కేంద్ర ప్రభుత్వం అందించే చిన్నపొదుపు పథకాలకు ఆధార్

కేంద్ర సర్కార్ అందించే పథకాలైన సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రజలు వారి అకౌంట్లు ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే.. కేవైసీ కోసం ఆధార్ నంబర్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ తేదీలోపు ఆధార్ నంబర్ సమర్పించని వారి అకౌంట్లు అక్టోబర్ 1 నుంచి ఫ్రీజ్ కానున్నాయి.