Soon Petrol Diesel Price Reduced Rs 30: త్వరలో పెట్రోల్, డీజిల్ పై రూ. 30 తగ్గించే చాన్స్.. కారణం ఇదే

త్వరలో పెట్రోల్, డీజిల్ పై రూ. 30 తగ్గించే చాన్స్.. కారణం ఇదే

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు.. అటు కేంద్ర ప్రభుత్వం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. జనాల మీద వరాల వర్షం కురిపిస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం.. ఎప్పుడు లేని విధంగా.. ఎల్పీజీ సిలిండర్‌ మీద ఏకంగా 200 రూపాయాల భారీ తగ్గింపు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర నిర్ణయంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా గ్యాస్‌ సిలిండర్‌ ధర.. వెయ్యి రూపాయలకు పైనే అమ్ముడవుతోంది. ఒకవేళ ధర తగ్గినా మహా అయితే.. 20, 30 రూపాయలు తగ్గడం జరిగేది. కానీ ఈ సారి కేంద్రం ఏకంగా 200 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

అంతేకాక ఉజ్వల్ యోజన కింద సిలిండర్లు తీసుకుంటున్న వారికి ఏకంగా 400 రూపాయలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మరింత సంతోషం కలిగించే అంశంగా చెప్పవచ్చు. 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే.. గ్యాస్‌ ధర మాదిరిగానే.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..

గ్యాస్‌ సిలిండర్‌ ధర మాదిరిగానే.. పెట్రోల్‌, డీజిల్‌ ధర.. లీటర్‌ మీద ఏకంగా 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సదస్సులో మాట్లాడుతూ.. రాష్ట్రాలు అంగీకరిస్తే.. పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని.. దీనిపై ఆలోచన చేస్తున్నామని ప్రకటించారు. ఇది ఆచరణరూపం దాల్చితే.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్‌ చాలా కాలం నుంచి వినిపిస్తోంది.

జీఎస్టీ పరిధిలోకి వస్తే ఇంధన ధర ఎంత తగ్గుతుంది అంటే..

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ మీద గరిష్టంగా 28 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. ఈ లెక్కన చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుతం వ్యాట్‌ పన్ను ధర దాదాపు 35 శాతం గా ఉంది అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ ధర లీటరు మీద 19 రూపాయలుగా ఉంది. నిజానికి పెట్రోల్ ఒక లీటరు ప్రస్తుతం మార్కెట్లో డీలర్లకు కేవలం 57 రూపాయలకే లభిస్తోంది. అయితే దాని మీద పైన పేర్కొన్న పన్నులన్నింటిని కలపుకుంటే.. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ ధర సుమారు 109 రూపాయలు పలుకుతోంది.

ఒకవేళ ప్రస్తుతం రాష్ట్రాలు అంగీకరించి.. పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీ పరిధిలోకి వస్తే.. అప్పుడు లీటర్ పెట్రోల్ పై కేవలం 28 శాతం మాత్రమే టాక్స్ మాత్రమే పడుతుంది. దాంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80 పలికే అవకాశం ఉంది. అంటే పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. ఏకంగా లీటర్‌ పెట్రోల్‌ మీద దాదాపు 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

Show comments