PM కిసాన్‌ సాయం రూ.9 వేలకు పెంపు.. ఆసక్తిరేపుతోన్న కొత్త బడ్జెట్‌

PM Kisan Yojana: లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ మొత్తాన్ని పెంచబోతున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

PM Kisan Yojana: లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ మొత్తాన్ని పెంచబోతున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

మరో రెండు, మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎలక్షన్స్‌లో గెలిచి ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ఆశిస్తోంది. అంతేకాక ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం రకరకాల పథకాలను ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా గతేడాది గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అలానే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో ఇంధన ధరల తగ్గింపుకు సంబంధించి కీలక ప్రకటన ఉండనుంది అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ బడ్జెట్‌లో అన్నదాతలకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోందట మోదీ సర్కార్‌. దీనిలో భాగంగా పీఎం కిసాన్‌ యోజన సాయాన్ని మొత్తం పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టబోతున్న మధ్యంతర బడ్జెట్‌లో ప్రాథమిక రంగమైన వ్యవసాయానికి, ముఖ్యంగా రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌..‌ గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.. వ్యవసాయ రంగం కోసం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య పథకాల్లో ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ఒకటి.

దీని ద్వారా రైతులకు నేరుగా నగదు సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం కింద.. సాగు చేయడానికి అనుకూలంగా ఉన్న భూమి కలిగిన రైతులందరికీ ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే రానున్న మధ్యంతర బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని 9 వేల రూపాయలకు పెంచబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం పీఎం కిసాన్‌ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. విడతకు రెండు వేల రూపాయల చొప్పున​ మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కిసాన్‌ నిధి ద్వారా రైతులకు అందించే మొత్తం.. వారి వ్యవసాయ పెట్టుబడులకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడుతోంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తుంది ప్రభుత్వం.

2024 మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజన ద్వారా అందిస్తోన్న ఆర్థిక సాయాన్ని పెంచబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తమకు ప్రభుత్వ వర్గాలు చెప్పాయని వెల్లడిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్తను ప్రచురించింది. దీని ప్రకారం, రైతులకు ఏటా ఇస్తున్న పెట్టుబడి సాయం 6 వేల రూపాయలను మోదీ సర్కార్‌ రూ. 8,000 లేదా రూ. 9,000లుగా చేయవచ్చు అని తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల ముందు రైతులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోందని అర్థం అవుతోంది. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది.

Show comments