ఫ్రీగా 2 మొక్కలు ఇస్తారు.. వాటిని పెంచితే 9 లక్షలు వస్తాయట! ఇదేమి ఆఫర్?

Red Sandal Cultivation: పెద్దపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి రెండు మొక్కలు ఉచితంగా ఇస్తున్నాడు. వాటిని పెంచితే 9 లక్షల రూపాయలు వస్తాయని చెబుతున్నాడు. ఆ వివరాలు..

Red Sandal Cultivation: పెద్దపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి రెండు మొక్కలు ఉచితంగా ఇస్తున్నాడు. వాటిని పెంచితే 9 లక్షల రూపాయలు వస్తాయని చెబుతున్నాడు. ఆ వివరాలు..

మొక్కలు, చెట్లు పర్యావరణాన్ని కాపడటమే కాక.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి కూడా. చాలా వరకు మొక్కలు, చెట్లలో ఔషధ గుణాలుంటాయి. వాటికి మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంటుంది. కొన్నింటికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉంటుంది. అదుగో ఆ కోవకు చెందినదే ఎర్ర చందనం. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి ఉండే డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేజీ ధరనే లక్షల్లో పలుకుతుంది. అంత డిమాండ్‌ కాబట్టే ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. స్మగ్లర్లు మాత్రం.. ఎర్ర చందనాన్ని వదలడం లేదు. నిత్యం ఏదో ఓ చోట ఎర్ర చందనం స్మగ్లర్స్‌ పట్టుబడుతూనే ఉంటారు. ఒకప్పుడు ఇది కేవలం శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే పెరుగుతుందని నమ్మేవారు.

కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని చాలా చోట్ల పెంచుతున్నారు. ఒకప్పుడు ఎర్రచందనం నిషేధిత పంట. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనం సాగును సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించింది. దాంతో ప్రస్తుతం ఎర్ర చందనం సాగు, ఎగుమతికి ఎలాంటి ఆటంకం లేదు. పైగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. వాటిని నరికి అమ్మేటప్పుడు మాత్రం అటవీ శాఖ అధికారికి ముందుగా తెలియజేసి.. వారి నుంచి అనుమతి తీసుకోని మార్కెటింగ్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఎర్ర చందనం సాగుకి ఎలాంటి ఆటంకం లేకపోయినా చాలా మందికి దీని గురించి తెలియదు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం, ప్రాంతానికి చెందని గోలివాడ ప్రసన్న అనే యువకుడు.. కొన్నాళ్ల పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించి ఎర్ర చందనం మొక్కల పెంపకం, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకుని.. తమ ప్రాంత ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాడు. అంతేకాక నిరుపేదలకు ఎర్ర చందనం మొక్కలను ఉచితంగా అందిస్తున్నాడు.

కేపీఎన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఎర్ర చందనం మొక్కలు తెప్పించి వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు ప్రసన్న. ఇంటికి రెండు చెట్లు ఇచ్చి.. వారితో రాతపూర్వకంగా అగ్రిమెంట్‌ చేసుకుంటున్నాడు. ఎర్ర చందనం మొక్క నాటి 15 ఏళ్ల పాటు దాన్ని కాపాడినట్లైతే.. ఒక్కో చెట్టుకు 4.50 లక్షల రూపాయలు ఇస్తామని తెలుపుతున్నాడు. అంటే రెండు చెట్లకు కలిపి 9 లక్షల రూపాయలు వస్తాయి అన్నమాట.

పేద కుటుంబాల్లోని వారు.. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీటిని పెంచితే.. అది వారు ఆర్థికంగా స్థిరపడటంలో, లేదా చదువులకు, ఇతర ఖర్చులకు ఉపయోగపడతాయి అంటున్నారు. దీనిపై ఆసక్తి ఉన్న వారు ప్రసన్నను కాంటాక్ట్‌ అవ్వొచ్చు.

గమనిక:

ఇక్కడ ప్రచురించిన సమాచారానికి ఐడ్రీమ్‌ మీడియాతో ఎలాంటి సంబంధం లేదు. News18 Telugu ప్రకారం ఈ సమాచారం అందివ్వడం జరిగింది. ఎవరైనా దీన్ని అమలు చేయాలనుకుంటే.. పూర్తిగా నిర్ధారించుకుని.. వాస్తవాలు తెలుసుకుని ముందడుగు వేయాలి అని సూచన.

Show comments