Prince Yawar- Bigg Boss 7 Telugu: ప్రిన్స్ కి అదిరిపోయే ఛాన్స్.. యావర్ ఆర్మీ రెడీ అవుతోంది!

ప్రిన్స్ కి అదిరిపోయే ఛాన్స్.. యావర్ ఆర్మీ రెడీ అవుతోంది!

బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ ఇవ్వాలి అని అనుకుంటే అవకాశాలు బొచ్చడు వస్తాయి. అయితే మనం ఎలాంటి మార్గం ఎంచుకుంటున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం ఎంత అవసరమో.. దానిని సరైన మార్గంలో వాడుకోవడం కూడా అంతే అవసరం. లేదంటే మొదటికే మోసం అవుతుంది. అలాంటి ఒక మంచి అవకాశం ప్రిన్స్ యావర్ కు దక్కింది. మొదటి నుంచి చెప్పుకుంటున్నట్లుగానే భాష రాకపోయినా ప్రిన్స్ సందర్భాన్ని చాలా బాగా వాడుకుంటున్నాడు. తనది తప్పు లేదని తెలిస్తే మాత్రం అవతలి వారిపై రెచ్చిపోతున్నాడు. ఆ విషయాన్ని బిగ్ బాస్ గమనించినట్లు ఉన్నారు. అతనికి హీరో అయ్యే అవకాశాన్ని ఇచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ స్ట్రాంగ్ అని తెలిసినా.. ప్రేక్షకుల్లో ఆదరణ ఉందని తెలిసినా.. బిగ్ బాస్ వారిని కచ్చితంగా లేపుతాడు. ఇప్పుడు ఆ అవకాశం ప్రిన్స్ యావర్ ని వరించింది. ఎందుకంటే ప్రిన్స్ కి మొదటి నుంచి హౌస్ లో వ్యతిరేకత ఉంది. కటౌట్ ఉన్నా.. భాష రాదని కంటెస్టెంట్స్ టార్గెట్ చేశారు. అయితే అదే ప్రిన్స్ యావర్ కి అడ్వాంటేజ్ అయింది. అతడిని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది. యావర్ అవకాశం దొరికినప్పుడల్లా అతనికి కటౌట్ మాత్రమే కాదు.. కంటెంట్ కూడా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే రెండుసార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ప్రిన్స్ యావర్ కి మరో అద్భుతమైన అవకాశం దక్కింది. ఈసారి సింపథీ కచ్చితంగా వర్కౌట్ అవుతుంది.

మూడో పవరాస్త్రం కోసం ప్రిన్స్ యావర్ ని కంటెండర్ గా బిగ్ బాస్ ఎంపిక చేశారు. అయితే రతికా రోజ్, టేస్టీ తేజ, ధామినీ.. ప్రిన్స్ యావర్ అనర్హుడు అంటూ కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ కి చెప్పారు. ఇప్పుడు ప్రిన్స్ యావర్ అర్హుడు అని వారితోనే చెప్పించేందుకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏంటంటే ఒక T షేప్ స్టాండ్ మీద యావర్ తన గడ్డం పెట్టి నిల్చోవాలి. ఆ తర్వాత అనర్హుడు అని ఓటేసిన రతిక, తేజ, ధామినీ అతడిని ఇబ్బందులు పెడుతూ ఉండాలి. వాళ్లు ఎంత ఇబ్బంది పెట్టినా.. యావర్ ఒక గంటపాటు అలాగే ఉండాలి. అలా ఉంటే అతను కంటెండర్ అవుతాడు. అయితే ఆ టాస్కులో అతను గెలిచాడు. ఇక్కడ సింపథీ వస్తుంది అని ఎందుకు అంటున్నాం అంటే. ఈ టాస్కు వల్ల బిగ్ బాస్ సీజన్లో హీరోలు అయిన వాళ్లు, విలన్లు అయినవాళ్లు చాలా మందే ఉన్నారు.

ముఖ్యంగా కౌశల్ విన్నర్ కావడంలో, కౌశల్ ఆర్మీ క్రియేట్ కావడంలో ఈ టాస్కు పాత్ర చాలా ఉంది. అలాగే అభిజిత్ కు పాజిటివ్ టాక్, ప్రేక్షకుల నుంచి సపోర్ట్ లభించింది కూడా ఈ టాస్కు నుంచే. అలాగే అరియానా తిట్లు కూడా తింది. అలాంటి టాస్కులో ప్రిన్స్ యావర్ హీరో అయిపోయాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కదలకుండా ఉండి తన సత్తా చాటాడు. ఈ విజయంతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేశాడు. నిజానికి ప్రిన్స్ యావర్ ను చాలా ఇబ్బంది పెట్టారు. గుడ్లు ముఖానకొట్టారు. జండూబామ్ ముక్కుకి రాశారు. తలపై చెత్త వేశారు, బురదనీళ్లు పోశారు. ముఖ్యంగా రతిక మాత్రం ఎక్కడా తగ్గలేదు. యావర్ ని నానా హింసలు పెట్టింది. కానీ, అతను మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు. అయితే లైవ్ లో పూర్తిగా వీడియో చూపించలేదు. ఎపిసోడ్ లో కాస్త క్లియర్ గా చూపించే అవకాశం ఉంటుంది.

ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల ప్రిన్స్ యావర్ మరో కొన్ని వారాలు తప్పకుండా హౌస్ లోనే ఉంటాడని చెప్పచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7లో ప్రిన్స్ యావర్ మరో కౌశల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అందరూ అతడిని టార్గెట్ చేయడం, ఇలాంటి కష్టమైన టాస్కు రావడం అలాగే అనిపిస్తోంది. అయితే ప్రిన్స్ ని లేపడానికి బిగ్ బాస్ కావాలనే ఈ టాస్కు ఇచ్చాడని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మొదటి నుంచి ప్రిన్స్ యావర్ కంటెట్ ఇవ్వడంలో ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు తెలుగు కూడా బాగానే మాట్లాడుతున్నాడు. అయితే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ టాస్కు వల్ల రతికాకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూడాలి. అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంది. నెగిటివ్ కావచ్చు.. పాజిటివ్ కావచ్చు. మరి.. ప్రిన్స్ యావర్ ఆటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments