ఏడు కొండల మీద కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఎక్కడెక్కడి నుంచో వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమలకు వస్తుంటారు. ఆ వెంకన్నను దర్శనం చేసుకొని తాదాత్మ్యతకు లోనవుతారు. కానీ అలాంటి వెంకన్న సొమ్ముకే ఆశపడ్డారు దొంగలు. వడ్డీకాసుల వేంకటేశ్వరుడి దగ్గరే వక్రబుద్ధి చూపించారు. భక్తుల సేవ కోసం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ బస్సును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ తిరుమలలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన ఒక ఎలక్ట్రిక్ బస్సును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.
తిరుమల కొండ పైన భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా తరలించేందుకు టీటీడీ వాడుతున్న ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సును అపహరించారు. ఈ బస్సును టీటీడీ డిపో వద్ద రాత్రి పార్క్ చేశారు. కానీ తెల్లవారి చూసేసరికి గ్యారేజ్‌లో బస్సు కనిపించలేదు. దీంతో వెంటనే తిరుమల క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు అధికారులు. అయితే బస్సులోని ఒక టెక్నాలజీ ఆధారంగా ఎంక్వైరీ చేశారు పోలీసులు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బస్సు చోరీకి గురైనట్లు గుర్తించారు. బస్సులోని జీపీఎస్ సిస్టమ్ ఆధారంగా దాన్ని నాయుడుపేటకు తీసుకెళ్లినట్లు కనిపెట్టారు.
బస్సు నాయుడుపేట వద్ద ఉందని కనిపెట్టిన అధికారులు అక్కడికి క్రైమ్ పోలీసులను పంపారు. నాయుడుపేటలోని బిరదవాడ దగ్గర టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును గుర్తించారు పోలీసులు. నిందితుల కోసం బిరదవాడకు దగ్గర్లోని టిడ్కో ఇళ్లలో గాలిస్తున్నట్లు సమాచారం. తిరుమలలో ఇప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల హడావుడిలో అధికారులు ఉన్నారు. దీంతో భక్తులతో కలసిపోయిన దుండగులు.. టైమ్ చూసుకొని ధర్మరథం బస్సును కొట్టేశారని తెలుస్తోంది. బస్సు చోరీ విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు అందులోని జీపీఎస్ టెక్నాలజీ ఆధారంగా ఈజీగా గుర్తించారు. నాయుడుపేట వద్ద ధర్మరథం బస్సు ఉన్నట్లు గుర్తించి దాన్ని బిరదవాడ దగ్గర స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: CID కస్టడీకి చంద్రబాబు.. పవన్ మౌనం.. అసలేం జరుగుతోంది?