ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గతంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్గా పనిచేసిన ఆయన.. రెండోమారు బోర్డు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయనపై కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా ఆయన ఘాటుగా స్పందించారు. విమర్శకులను ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన మీద వస్తున్న ఆరోపణలపై ఆయన రియాక్ట్ అయ్యారు. తాను విమర్శలకు భయపడేవాడ్ని కాదని స్పష్టం చేశారు.
మీడియాతో మాట్లాడుతూ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. ‘నేను నాస్తికుడ్ని అని విమర్శలు చేసేవారికి ఇదే నా జవాబు. 17 సంవత్సరాల కిందే నేను టీటీడీ బోర్డుకు ఛైర్మన్ అయిన వ్యక్తిని. అప్పట్లో 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించా. తిరుమల ఆలయ మాడవీధుల్లో ఎవరూ చెప్పులతో వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నది నేనే. అన్నమయ్య 600వ వర్ధంతి ఉత్సవాలు కూడా నేనే జరిపించా. దళితవాడల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కూడా నేనే చేయించా’ అని టీటీడీ ఛైర్మన్ భూమన తెలిపారు.
తాను క్రైస్తవుడ్ని అని, నాస్తికుడ్ని అని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానమని భూమన చెప్పుకొచ్చారు. ఆరోపణలకు భయపడి మంచి పనులను తాను ఆపబోనని ఆయన స్పష్టం చేశారు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వ్యక్తినని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. తిరుమల వెంకన్నపై ఉన్న భక్తి, విశ్వాసాలను దెబ్బతీసేలా కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గత నాలుగేళ్లలో టీటీడీ చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పన మీద నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.