సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక స్టాలిన్ తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ఓ స్వామిజీ బహిరంగ ప్రకటన చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మంపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా స్టాలిన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భూమన.
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ పాలక మండలి సమావేశంలో మాట్లాడిన ఆయన స్టాలిన్ పై మండిపడ్డారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానం అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం తెలీక స్టాలిన్ సనాతన ధర్మానికి, కులాలను అట్టిపెట్టి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడిరేగే అవకాశాలు ఉన్నాయని, ఇది మంచి పద్దతి కాదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ఇక పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
కాగా.. సనాతన ధర్మాన్ని వ్యాప్తితో పాటు, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎల్ కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులందరికి అర్దమయ్యే విధంగా భగవద్గీత పుస్తకాల పంపిణీతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 29 స్పెషల్ డాక్టర్లు, 15 మంది డాక్టర్లతో పాటు.. చిన్నపిల్లల ఆసుపత్రిలో 300 మంది ఉద్యోగుల నియామకం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ముంబైలోని బంద్రాలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, సమాచారకేంద్రం నిర్మాణానికి సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇక 25 సంవత్సరాల లోపు పిల్లలు గోవిందా కోటిని రాస్తారో వారి కుటుంబానికి వీఐపీ కల్పిస్తామని వెల్లడించారు.