P Venkatesh
P Venkatesh
రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో నిబంధనలకు విరుద్దంగా వందల కోట్ల రూపాయలను దారిమళ్లించి కాజేసిన కేసులో ఏపీ సీఐడీ అధికారులు బాబును నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టి రిమాండ్ రిపోర్టును తయారు చేశారు. ఆ తర్వాత బాబును ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు సీఐడీ అధికారులు. తర్వాత ఇరు వాదనలు విన్న ఏసీబీ కోర్టు బాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నెపథ్యంలో బాబు అరెస్టుపై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటుడు సుమన్ బాబు అరెస్టుపై మాట్లుడుతూ.. పాలిటిక్స్ లో ఇదొక గుణపాఠం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబును అరెస్టు చేసేటపుడు అన్నీ ఆలోచించాకే అరెస్టు చేసి ఉంటారని హీరో సుమన్ వెల్లడించారు. సీఎం జగన్ వల్లనే బాబు జైలుపాలయ్యాడు అనడం సరికాదు. బాబు అరెస్టుకు చాలా కారణాలు ఉండి ఉంటాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. స్కిల్ స్కామ్ లో బాబు పాత్ర ఉన్నట్లుగా సీఐడీ తేల్చింది. చట్టానికి ఎవరు చుట్టం కాదు.. బలమైన కారణాలతోనే బాబును అరెస్టు చేసి ఉంటారని సుమన్ తెలిపారు. సమయం అనుకూలంగా లేనప్పుడు ఇలా జరుగుతుంటాయి. ప్రస్తుతం బాబు టైం బాలేదని, ఆయనకు అన్నీ అనుకూలంగా వచ్చే వరకు జైల్లోనే ఉంటారని సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.