KCR బాటలో చంద్రబాబు.. కుప్పంతో పాటు అక్కడి నుంచి పోటీ..

KCR బాటలో చంద్రబాబు.. కుప్పంతో పాటు అక్కడి నుంచి పోటీ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  ఆ  తరువాత వెంటనే ఏపీలో ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇక తెలంగాణలో అయితే గులాబీ పార్టీ ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా అభ్యర్థులను ప్రకటించింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ తో పాటు కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీచేయనున్నారు. కేసీఆర్ బాటలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

ఏపీలో ఎన్నికల హడావుడి  మొదలైంది. ప్రతిపక్ష పార్టీల నేతలు  చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లు వివిధ యాత్రల పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. మరోవైపు  సీఎం జగన్ తరచూ వివిధ జిల్లా పర్యటనలు సాగిస్తున్నారు.  స్టేట్ లోనే కాకుండా  ఓటర్ల జాబితా గురించి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఢిల్లీలో కూడా వార్ నడుస్తోంది. ఇలా వేడి మీద ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు సంబంధించిన   ఓ సరికొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది.

చంద్రబాబు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే.. 2024 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సారి కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం వెనుక కూడా చాలా కారణాలే  ఉన్నట్లు టాక్  వినిపిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో  చంద్రబాబును.. కుప్పంలో ఓడించాలని వైఎస్సార్ సీపీ పట్టుదలతో ఉంది. ఆ దిశగా వైఎస్సార్ సీపీ కార్యాచరణను అమలు చేస్తోంది. కుప్పంలో వైసీపీ జెండాను ఎగిరేంచాలనే ధృడ నిశ్చయంతో  చిత్తూరు జిల్లా పెద్దాయన, మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి ఉన్నారు.

ఈ క్రమంలోనే కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. అంతేకాక కుప్పం మున్సిపాలిటీతో సహా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగిరింది. అంతేకాక  కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్న భరత్ కు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించారు సీఎం జగన్..  అంతేకాక భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. అధికార పార్టీ  చేసే వై నాట్ 175 స్లోగన్ తో పాటు వై నాట్ కుప్పం అంటూ  కొత్త నినాదాన్ని కూడా అందుకుంది. వీటికి తోడు 2019 ఎన్నికల  ఫలితాల్లో కొన్ని రౌండ్లలో చంద్రబాబు నాయుడు వెనకంజలోకి వెళ్లారు.

అలాగే గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ కూడా భారీగా తగ్గింది. ఈ పరిణామాలన్నీ చూసిన చంద్రబాబు నాయుడు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.  అందుకే రెండు స్థానాల్లో  పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సారి కుప్పంతో పాటు మరో నియోజకవర్గం నుంచి చంద్రబాబు బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ బలంగా ఉండే స్థానాన్ని ఎంచుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే చంద్రబాబు రాజకీయ జీవితంలో మొట్టమొదటి సారి ఇలా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినట్లు అవుతుంది. మరి.. ఈ ఊహాగానాలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మరి.. చంద్రబాబు నాయుడిపై వస్తున్న  ఈ ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments