ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు.. కానీ అంతలోనే

ఆ యువకుడు తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాడు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించాడు. అందుకోసం కన్నవారిని.. సొంత ఊరిని వదిలి.. విదేశాలకు వెళ్లాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో.. ఊహించని విషాదం చోటు చేసుకుంది. బంగారు భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు.. అనూహ్యంగా మృతి చెందాడు. కన్న బిడ్డ కడసారి చూపు కోసం ఆ తల్లిదండ్రులు.. అల్లాడుతున్నారు. మరి ఇంతకు ఏం జరిగింది అంటే.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు.. గుండెపోటుతో కుప్పకూలాడు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామానికి చెందిన జమ్మి సుబ్బారావు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేశాడు. యూకేలోని కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ అడ్మిషన్ రావడంతో.. ఈ నెల 8న లండన్ వెళ్లాడు. అనంతరం యూనివర్సిటీలో రిపోర్ట్ చేయడం కోసం ఈ నెల 16న బస్‌లో బయలుదేరాడు. సుమారు ఐదు గంటల ప్రయాణం తర్వాత కార్డిఫ్‌ నగరంలో దిగాడు. ఆసమయంలో గుండెల్లో నొప్పిగా అనిపించడంతో..  గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని సోడా తాగాడు సుబ్బారావు.

కానీ.. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలాడు. అతడిని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది.. సుబ్బారావుని పరీక్షించగా.. అప్పటికే అతడు చనిపోయినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సుబ్బారావు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

చేతికి అంది వస్తాడని భావించిన చెట్టంత కొడుకు.. ఉన్నట్లుండి మృత్యువాత పడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసి వస్తాడుకున్న కొడుకు.. విగత జీవిగా మారాడని తెలిసి వారు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మరోవైపు సుబ్బారావు మృతి చెంది వారం రోజులు కావొస్తున్నప్పటికి.. ఇప్పటికి అతడి మృతదేహం యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్ మార్చురీలోనే ఉండటం గమనార్హం.

ఎలాగైనా తమ కుమారుడి డెడ్‌బాడీని స్వగ్రామానికి తీసుకురావాలని అతడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కన్నబిడ్డను కడసారి చూసుకునే అవకాశం కల్పించమని వేడుకుంటున్నారు. ఇక ఎంతో ఆరోగ్యంగా ఉన్న కొడుకు.. ఉన్నట్లుండి గుండెపోటుతో మృతి చెందడాన్ని వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సుబ్బారావు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Show comments