దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ ఈ రైళ్లు నడుస్తున్నాయి. తక్కువ టైమ్ లోనే గమ్యస్థానాలకు చేరుకునేందుకు, ఆధునాతన సౌకర్యాలతో పరుగులు పెడుతున్న ఈ వందే భారత్ రైలు.. అందరిని ఆకర్షిస్తోంది. వందే భారత్ రైలుకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే కేంద్ర తరచూ వివిధ మార్గాలకు వందే భారత్ రైలు సర్వీస్ లను ప్రారంభిస్తుంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. కాచిగూడ-యశ్వంత్ పూర్, విజయవాడ-చెన్నై మధ్య కూడా వందే భారత్ రైళ్లను ప్రారంభించ నుంది. వీటితో కలిపి 9 వందే భారత్ లను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమైంది.
కేంద్రం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను పట్టాలెక్కిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరో 9 వందేభారత్‌లను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమైంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య వందేభారత్ రైలు ఈ నెల 24న ప్రారంభం కానుంది. కాచిగూడ-యశ్వంత్ పూర్ మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ఆదివారం మధ్యాహ్నం 12.30కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చుల్ విధానంలో ప్రారంభించనున్నారు.
కాచిగూడ రైల్వేస్టేషన్ వేదికగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. సోమవారం నుంచి ఈ వందేభారత్ రైలు కాచిగూడలో ఉదయం 5.30కు బయలుదేరి.. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. తిరిగి 2.45కి యశ్వంత్ పూర్ లో బయలు దేరి, రాత్రి 11.15కు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ-యశ్వంత్ పూర్ మార్గంలో బయలుదేరే ఈ రైలు మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్లలో ఆగుతుంది.
ఇక ఈ ట్రైన్ తో పాటు ఈనెల 24న ప్రధాని మోదీ ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. వాటిలో విజయవాడ-చెన్నై మార్గంలో కూడా వందే భారత్ రైలు ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు విజయవాడలో ఉదయం 5.30కి బయలు దేరి మధ్యాహ్నం 12.10కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి బయలు దేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. మధ్యలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు వెళ్లనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీదుగా రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
సికింద్రాబాద్- విశాఖపట్టణం, సికింద్రాబాద్- తిరుపతి మధ్య ఈ రెండు రైళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నిత్యం రద్దీగా ఉండే విజయవాడ – చెన్నై, కాచిగూడ-యశ్వంత్ పూర్ మార్గంల్లో కూడా వందేభారత్ పట్టాలెక్కబోతోంది. ఆగస్టులోనే ఈ రైలును ప్రారంభించాలని భావించారు.. కానీ అనివార్యా కారణాలతో వాయిదా పడింది.. ఈ నెల 24న ప్రధాని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య నాలుగుకు చేరుతుంది. మరి.. తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైలు రానుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.