తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పవన్ సినిమాల కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. సినిమాల పరంగా ఈ మధ్య జోరు పెంచారు పవన్. మేనల్లుడు సాయి తేజ్‌తో కలసి ఆయన నటించిన ‘బ్రో’ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌లోనూ పవన్ పాల్గొంటున్నారు. పవన్ హీరోగా స్టార్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూట్ దాదాపుగా పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది.
ఈ ఏడాది పవన్ వరుస సినిమాలతో ఆడియెన్స్‌ను పలకరించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే రాజకీయాల్లో బిజీ అవ్వాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే వారాహి యాత్ర మొదటి దశ పూర్తయింది. తాజాగా దెందులూరు నియోజకవర్గం నేతలు, వీర మహిళలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన భార్య, పిల్లల గురించి చెబుతూ పవన్ ఎమోషనల్ అయ్యారు. తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మాట సరదాకు చెప్పడం లేదని.. ప్రతి రోజు ఇంట్లో నుంచి వస్తే, తిరిగి ఇంటికి వెళ్తానో లేదో కూడా తెలియడం లేదన్నారు. తన బాధ అంతా ప్రజల గురించేనని పవన్ చెప్పుకొచ్చారు.
తాను ఒక విప్లవకారుడినని పవన్ కల్యాణ్ అన్నారు. మార్పు తప్ప ఇంకే ఆశ తనకు లేదన్నారాయన. తాను డిసైడ్ అయ్యానని.. ఫైట్ చేయడానికి రెడీ అయ్యానన్నారు పవన్. అది కష్టం అని తెలుసునని.. కానీ పోరాడేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. ప్రజల బాధ్యత తీసుకున్నానని.. వెనక్కి రాలేనని తన భార్యతో చెప్పానన్నారు పవన్. ‘ఇక, తప్పదు నేను వెళ్లాల్సిందేనని నా భార్యతో చెప్పా. ఉంటే ఉంటా పోతే పోతా. నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు క్షమించు అని ఆమెతో చెప్పా’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పవన్ చేసిన తాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.