iDreamPost
android-app
ios-app

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన లోకేశ్!

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన లోకేశ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఏపీ పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి. చుక్కాని లేని నావ అన్నట్లు టీడీపీ పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే నేనున్నాంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి అండగా ముందుకు వచ్చారు. ఏకంగా కలిసి పోటీ చేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అదే ఊపులో వారాహి యాత్రలో భాగంగా మాట్లాడుతూ.. టీడీపీ చాలా బలహీనంగా ఉంది.. తానే ఆ పార్టీకి సేవియర్ అనే రీతిలో పవన్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు తెగ ఫీలయిపోతున్నారట. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై లోకేశ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ఏ-14గా నారా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగా..మంగళవారం తాడేపల్లిలోని సిట్ ఆఫీస్ కు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్న సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చి.. అనంతరం తిరిగి విచారణ కొనసాగించారు. ఇక విచారణ ముగిసిన తర్వాత బుధవారం కూడా రావాలంటూ లోకేష్ కి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు.

విచారణకు సంబంధించిన కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు. గూగుల్ లో సెర్చ్ చేసిన సమాధానాలు దొరికే ప్రశ్నలు సీఐడీ అధికారులు అడిగారని లోకేష్ అన్నారు. అంతేకాక తాను విచారణకు సహకరించినందుకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారని అన్నారు.  ఇదే సమయంలో టీడీపీ క్షేత్ర స్థాయిలో చాలా డల్ గా ఉందని, పార్టీ వెనకబడిపోతుందని వస్తున్న కామెంట్స్ పై లోకేష్ అభిప్రాయమేంటి అంటూ మీడియా అడిగింది. దానికి లోకేష్ స్పందిస్తూ.. తెలుగు దేశం పార్టీలో ఎలాంటి ఆందోళన లేదని.. అందరం సమిష్టిగా పని చేస్తున్నామని అన్నారు. అలానే ఓటర్ల లిస్ట్ నుంచి, అభ్యర్థులను నిర్ణయించే వరకు అన్ని బాధ్యతలను తాము నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు.

ఇదే మాటలు ఇప్పుడు అందరిలో చర్చనీయాశంగా మారాయి. టీడీపీ బలహీన పడింది.. అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు లోకేష్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని పొటిలికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలానే పవన్ కళ్యాణ్ సీఎంగా భావిస్తున్నారు కానీ.. టీడీపీ వాళ్లు కూరలో కరివేపాకులా వాడుకోవాలని చూస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బాలకృష్ణ, తాజాగా నారా లోకేష్ చేసిన పరోక్ష వ్యాఖ్యలే అందుకు నిదర్శనమనే టాక్ వినిపిస్తోంది. మరి.. పవన్ కల్యాణ్ ను టీడీపీ చాలా లైట్ గా తీసుకుందంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.