తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్‌పై ఏపీ మంత్రి మేరుగు నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. బాబు.. ప్రజల సొమ్ము దోచుకొని చివరికి జైలు పాలయ్యాడన్నారు. చేసిన పాపం ఎప్పుడో ఒకప్పుడు పండుతుందని.. చట్టానికి దొరికిన దొంగ చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి మేరుగు. చంద్రబాబు జీవితం అవినీతిమయమని.. అయితే ఆయనకు చట్టాలు చుట్టాలు కావన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని.. బాబు ఇంకా అనేక కేసుల్లో ఇరుక్కుంటారని మంత్రి మేరుగు చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు ప్రజల్లో సానుభూతి లేదన్నారు మంత్రి మేరుగు నాగార్జున. నారా లోకేష్ రెడీగా ఉండాలని.. త్వరలో ఆయన కూడా జైలుకు వెళ్లబోతున్నాడని అన్నారు. ఇకనైనా బాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు బతికిపోయారని.. ఎన్నో అక్రమాలు చేసిన ఆయన ఆఖరికి దొరికిపోయారని మంత్రి నాగార్జున తెలిపారు. సీఎం జగన్ పేదల కోసం పారదర్శకంగా సంక్షేమాన్ని అందిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోయారని సీరియస్ అయ్యారు. బాబు తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌ను వెంటేసుకొని ముఖ్యమంత్రి జగన్ మీద ఎన్నెన్ని ఆరోపణలు చేశారో ప్రజలు చూస్తూనే ఉన్నారని మంత్రి మేరుగు పేర్కొన్నారు.
‘చంద్రబాబు మీద మాకు ఎలాంటి కక్ష లేదు. కక్ష ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసేవాళ్లం. ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు కచ్చితంగా కోర్టు బోనులో నిలబడక తప్పదు. చంద్రబాబును అరెస్ట్ చేయగానే పవన్ కల్యాణ్ హడావుడిగా వచ్చాడు. ఎంత హడావుడిగా వచ్చాడో అంతే హడావుడిగా ఆయన వెళ్లిపోయాడు. పవన్ ఎందుకు వచ్చాడో, రోడ్డు మీద ఎందుకు పడుకున్నాడో ఆయనకే తెలియదు. రాష్ట్రంలో తెలుగుదేశం బంద్‌కు ఎలాంటి స్పందన లేదు. ప్రజలెవరూ ఈ బంద్‌ను పట్టించుకోలేదు’ అని మంత్రి మేరుగు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: పవన్ ఓ దరిద్రుడు.. ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడు: మంత్రి రోజా