భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలోకి రాకెట్లను పంపించి ప్రయోగాలు నిర్వహిస్తుందనేది తెలిసిందే. ఇటీవల వరుస ప్రయోగాలు విజయవంతం అవ్వడంతో ఇస్రో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. చంద్రుడి మీద చంద్రయాన్-3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ దిగనుండటం ఇస్రో ప్రయోగాల్లో మరో గుడ్ న్యూస్‌గా చెప్పాలి. ఇదే జోరులో సూర్యుడిపై రాకెట్‌ను పంపి పరిశోధనలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని వచ్చే నెల మొదట్లో చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా ఇస్రో చేపట్టిన ప్రయోగాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగేవి.
ఏపీలోని తిరుపతి జిల్లా, శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్లను నింగిలోకి పంపుతూ వస్తోంది ఇస్రో. రాకెట్ల ప్రయోగానికి దేశంలో మరో వేదిక లేకపోవడంతో ఇక్కడి నుంచే ఇస్రో కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే దేశంలో రెండో ప్రయోగ వేదిక నిర్మాణానికి కేంద్ర సర్కారు అనుమతి ఇవ్వడంతో ఇస్రో చర్యలు చేపట్టింది. తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని కులశేఖరపట్నంలో రెండో ప్రయోగ వేదికను ఏర్పాటు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెడీ అవుతోంది. ప్రయోగ వేదిక ఏర్పాటు కోసం మొత్తం 2,300 ఎకరాల భూమిని సేకరించి.. నిర్మాణ పనులను ప్రారంభించింది.
నిర్మాణంలో ఉన్న కులశేఖరపట్నంలోని ప్రయోగ వేదికను త్వరలో పూర్తి చేసి.. అక్కడి నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో ప్రతిపాదిస్తోంది. ఈ ప్రయోగ వేదిక నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తవుతాయని ఇస్రో అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలోనే రెండో ప్రయోగ వేదికను తమిళనాడులో నిర్మిస్తుండటంతో దీన్ని వినియోగించుకునేందుకు అక్కడి స్టాలిన్ సర్కారు పావులు కదుపుతోంది. రాకెట్ల ప్రయోగం కోసం నిర్మిస్తున్న ప్రయోగ వేదికకు దగ్గర్లో అంతరిక్ష పరిశ్రమ, ప్రొపెల్లంట్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఇస్రోకు అవసరమైన వస్తువులను అందించడమే కాకుండా అక్కడ అభివృద్ధి, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించాలని డీఎంకే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.