Dharani
IMD Heavy Rain Alert -TG, AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
IMD Heavy Rain Alert -TG, AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
Dharani
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్థంభించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అలానే వరదల కారణంగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 18 మంది చనిపోయారు. మూగ జీవాల గల్లంతు, భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇక నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక నేడు అనగా సోమవారం నాడు తెలంగాణలోని 8 జిల్లాలకు ఐఎండీ అత్యంత భారీ వర్ష సూచన జారీ చేసింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ను కూడా వానలు వీడటం లేదు. మరో 24 గంటలు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇక గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు బెజవాడ అతలాకుతలం అవుతోంది. బుడమేరు ఉధృతికి విజయవాడ నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అనేక కాలనీల్లో ఐదు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆహారం, మంచినీళ్లు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.