Dharani
IMD Heavy Rain Alert To AP, TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయిన వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ వివరాలు..
IMD Heavy Rain Alert To AP, TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయిన వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ వివరాలు..
Dharani
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. గుజరాత్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పైకి వెళ్లేకొద్ది దక్షిణం వైపు వంగి ఉందని వాతావరణశాఖ చెప్పుకొచ్చింది. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఏపీలోని ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందన్నారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు అనగా శుక్రవారం నాడు మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడమే కాక ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అల్ప పీడనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తూ రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఇక దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 44 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 నంబర్లలో సంప్రదించాలన్నారు.