iDreamPost
android-app
ios-app

మొన్న వయనాడ్.. నేడు విజయవాడ.. విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురు మృతి

  • Published Aug 31, 2024 | 5:22 PM Updated Updated Aug 31, 2024 | 5:22 PM

Heavy Rains In Vijayawada: నెల రోజుల క్రితం వయనాడ్ లో జరిగిన ప్రకృతి విలయతాండవం సంఘటనను మరచిపోలేము. అంతలా తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. ప్రస్తుతం విజయవాడలో అలాంటి పరిస్థితినే గుర్తు చేసేలా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Heavy Rains In Vijayawada: నెల రోజుల క్రితం వయనాడ్ లో జరిగిన ప్రకృతి విలయతాండవం సంఘటనను మరచిపోలేము. అంతలా తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. ప్రస్తుతం విజయవాడలో అలాంటి పరిస్థితినే గుర్తు చేసేలా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

మొన్న వయనాడ్.. నేడు విజయవాడ.. విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురు మృతి

నెల రోజుల క్రితం కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయతాండవం ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కొండచరియలు విరిగిపడి చాలా మంది మృత్యువాత పడ్డారు. ప్రకృతి ప్రళయం కారణంగా చాలా మంది నివాసాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. తాజాగా విజయవాడలో పరిస్థితులు చూస్తుంటే వయనాడ్ దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడ మునిగిపోయింది. నేషనల్ హైవే మోకాళ్ళ లోతులో మునిగిపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు సిబ్బంది. ఈ ఘటనలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా.. మూడు ఇల్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. అయితే దెబ్బ తిన్న ఇళ్లలో పలువురు చిక్కుకోవడంతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కొండచరియలు విరిగి పడుతుండడంతో సమీప ఇళ్లలో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 

భారీ వర్షాల కారణంగా విజయవాడ నుంచి వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ వారి గుడి ఫ్లైఓవర్ ని తాత్కాలికంగా మూసివేశారు. కృష్ణానదిని తలపించేలా నేషనల్ హైవే జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కాజా టోల్ ప్లాజా వద్ద భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లాలో కురిసిన కుండపోత వానలకు పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. విజయవాడ-ఏలూరు రోడ్డు జలదిగ్బంధం అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బెజవాడ నీట మునిగిందని నగరవాసులు అంటున్నారు. తామెన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని చెబుతున్నారు. విద్యాధరపురం, భవానీపురం, గవర్నర్ పేట, మొగల్రాజపురంలో వరద నీరు నదిని తలపిస్తుంది.

హైదరాబాద్ లో వాన పడితే ఎలా మునిగిపోతుందో అదే పరిస్థితి ఇప్పుడు విజయవాడలో కనబడుతుంది. విజయవాడ అనే కాదు గుంటూరులో కూడా ఇదే పరిస్థితి. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఒక కారు వరదల్లో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.