తక్కువ ధరకే బంగారు నాణాలు! గుంటూరోళ్ళు బోల్తా!

ఈ రోజుల్లో మాటలతో బురిడీ కొట్టించి పబ్బం గడుపుకునే మోసగాళ్లు ఎక్కువయ్యారు. కష్టపడి సంపాదించేందుకు ఇష్టపడక అడ్డదారిలో లక్ష్మి దేవి వరించాలని చూస్తున్నారు. ఇదే ఆశ మోసాలకు ఆసరాగా మారింది. ఇక ఏముందీ మోసం చేయడం ఎలా అనే పాఠాలు నేర్చుకుని చాక చక్యంగా డబ్బులను కొట్టేస్తున్నారు. తాజాగా ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసపోయారు. బంగారు నాణేలు కుప్పకుప్పలుగా ఉన్నాయని, వాటిని తక్కువ ధరకే మీకు ఇచ్చేస్తానంటూ నమ్మబలికి వారిద్దరినీ మోసం చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని ఏటీ అగ్రహారంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన వెంకట రెడ్డి,కొండలు స్నేహితులు. వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఇదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడైంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు.

కాగా, ఈ నెల మీతో పని ఉందంటూ వెంకటేశ్.. వెంకట్ రెడ్డి, కొండలును కలిశాడు. తన వద్ద బంగారు నాణేలు ఉన్నాయని, బళ్లారికి చెందిన ఓ రైతు తనకు తక్కువ ధరకే ఇచ్చేశాడంటూ చెప్పాడు. అనుమానముంటే రెండు నాణెలు తీసుకొని పరీక్షించుకోవాలని వెంకటేశ్ సూచించాడు. ఆ నాణేలు తీసుకున్న స్నేహితులద్దరూ వాటిని చెక్ చేయించగా.. బంగారమనే తేలింది. దీంతో నమ్మకం ఏర్పడి వెంకటేష్‌ను మరోసారి కలిశారు. అంత పెద్ద మొత్తంలో బంగారం నాణేలు తన వద్ద లేవని, బళ్లారిలో ఉన్న రైతు పొలంలో ఉన్నాయని, అవి దున్నితే వస్తాయని నమ్మబలికాడు. ఇందుకోసం ఐదు లక్షలు ఇవ్వాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన వెంకట్, కొండలు.. తొలి విడతగా రూ. 5 లక్షలు ఇచ్చారు. బంగారం నాణేలు తెచ్చుకునేందుకు ముగ్గురు కలిసి బెంగళూరు వెళ్లారు.

బళ్లారి రైల్వే స్టేషన్‌కు రాగానే.. రైతు వీరి ద్దకు వచ్చి రెండు మూటలను ఇచ్చాడు. అవి విప్పదీసి చూడబోతుంటే.. వెంకటేశ్ వారిద్దరినీ వారించాడు. రైల్వే స్టేషన్ లో ఎవరైనా చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి.. తీరిగ్గా ఊరెళ్లాక చూసుకోండని చెప్పాడు. గుంటూరుకు వచ్చాక వెంకటేశ్ మెల్లిగా తప్పించుకున్నాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారులిద్దరూ మూటలు విప్పి చూడగా.. బంగారు నాణెలకు బదులు.. ఇత్తడి నాణాలుండటం చూసి అవాక్కయ్యారు. తాము మోసపోయామని, ఆ రైతు కూడా వెంకటేశ్ ఆడిన నాటకంలో పాత్ర ధారుడే అని గ్రహించారు. అనంతరం వెంకటేశ్ ను పట్టుకోని.. తమ డబ్బులు తమకు ఇవ్వాలని కోరగా.. అతడు నిరాకరించాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Show comments