P Venkatesh
చదువుకోవాలన్నా తన కోరికే ముందుకు సాగేలా చేసింది. నాడు బాల్య వివాహాన్ని ఎదిరించి నేడు అసాధారణ ప్రతిభతో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ప్రథమస్థానంలో నిలిచింది.
చదువుకోవాలన్నా తన కోరికే ముందుకు సాగేలా చేసింది. నాడు బాల్య వివాహాన్ని ఎదిరించి నేడు అసాధారణ ప్రతిభతో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ప్రథమస్థానంలో నిలిచింది.
P Venkatesh
ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ప్రతి అమ్మాయి ఉన్నత విద్యను అభ్యసించాలని.. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరుకుంటుంటారు. కాగా చదువుల్లో రాణించినప్పటికీ కొంతమందికి కుటుంబ పరిస్థితులు సహకరించక చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఆడపిల్లల తల్లిదండ్రులు సైతం కూతురుకు పెళ్లి చేస్తే తమ బాధ్యత పూర్తవుతుందని భావిస్తుంటారు. ఇదే విధంగా ఓ విద్యార్థిని చదువుల్లో రాణించింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలవడంతో చదువు మాన్పించి పెళ్లి చేయాలని తలిచారు తల్లిదండ్రులు. కానీ ఆ బాలిక బాల్య వివాహాన్ని ఎదిరించి నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణంకు చెందిన నిర్మల తన కలను నెరవేర్చుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 95.7%తో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 440కి 421 (95.7%) మార్కులు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది. నిర్మల గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో 600కి 537 మార్కులు సాధించింది. ఇంతటి ప్రతిభ కలిగిన అమ్మాయి తన చదువు ఆగిపోకూడదని పట్టుబట్టింది. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువుకొనసాగించాలని నిర్ణయించుకుంది.
ఆదోని మండలం పెద్ద హరివణంకు చెందిన శ్రీనివాసులు, హనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో నిర్మల చిన్న కుమార్తె కాగా.. మిగిలిన ముగ్గురికి వివాహాలు చేశారు. నిర్మల చదువుల్లో రాణిస్తోంది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా తల్లిదండ్రులు పై చదువులకు ఒప్పుకోలేదు. కానీ నిర్మలకు చదువుకోవాలన్నా ఆశ ఇంకా పెరిగింది. ఈ క్రమంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా.. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ఆ బాలిక ఇంటి వైపు వెళ్లారు. అప్పుడు నిర్మల తన మనసులో మాటను ఎమ్మెల్యేతో చెప్పింది. తాను పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నానని.. తాను ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేదని వివరించింది.
తనకు సాయం చేసి.. తన తల్లిదండ్రులను కూడా తనను చదివించేలా ఒప్పించాలని కోరింది. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అధికారులకు నిర్మల విషయాన్ని చెప్పి చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వెంటనే కలెక్టర్ డాక్టర్ సృజన స్పందించారు. ఆస్పరి కేజీబీవీలో బైపీసీ గ్రూప్‌లో చేర్పించాలని అధికారుల్ని ఆదేశించారు కలెక్టర్. నాడు బాల్య వివాహాన్ని ఎదిరించి నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రథమ స్థానంలో నిలిచింది నిర్మల. తాను బాగా చదవుకుని ఐపీఎస్ అవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల చెబుతోంది. తన చదువుకు సహకరించిన కలెక్టర్, అధికారులు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసింది నిర్మల.