iDreamPost
android-app
ios-app

ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పిన సీఎం జగన్‌.. బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నిధులు జమ

ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పిన సీఎం జగన్‌.. బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నిధులు జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా వినూత్న రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారు. వృద్ధులకు పించన్లు, విద్యార్థులకు అమ్మఒడి,ఆటో కార్మికులకు, రైతులకు నేరుగా నగదు బదిలీ చేసి ప్రజల నుంచి ఘనమైన మెప్పును పొందుతోంది వైసీపీ ప్రభుత్వం. తాజాగా కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్తను అందించింది. రెండు గుడ్ న్యూస్ లు చెప్పి రైతుల కళ్లలో ఆనందం నింపారు. ఆ వివరాలు మీకోసం..

రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసా కింద సంవత్సరానికి రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అనగా మొదటి విడతగా మే నెలలో రూ.7,500, రెండవ విడతగా అక్టోబర్ లో రూ.4000, మూడవ విడతగా జనవరిలో రూ.2000 సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాగా ఇవాళ రైతు భరోసా నిధులను లబ్థిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి వర్చువల్ గా నమోదు చేశారు సీఎం జగన్. కౌలు రైతులతో పాటు, దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థిక సాయం అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పథకం కింద మొత్తం 1,46,324 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలు బటన్‌ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కౌలు రైతులకు సాయం అందిస్తున్నామని తెలిపారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నామని సీఎం వెల్లడించారు. మొదటి శుభవార్తగా కౌలు రైతులతో పాటు, దేవాదాయ భూములను కౌలు చేసుకుంటున్న రైతులకు తొలి విడత పెట్టుబడి సాయంగా రూ. 7,500 ఇస్తున్నామని, అదేవిధంగా వర్షాల దెబ్బకు పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీగా ఆ సీజన్ లోపే రైతులకు పరిహారం అందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు.