ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నారు. అలాగే అన్ని వర్గాల సంక్షేమం మీదా ఆయన ఫోకస్ పెడుతున్నారు. రైతాంగానికి చేదోడుగా నిలుస్తున్నారు. తమ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కౌలు రైతులకు కూడా నిలబడే సర్కారు తమదేనని సీఎం జగన్ ఉద్ఘాటించారు. భూమి లేని పేదలకు కూడా తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో శుక్రవారం కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా తొలి విడత నిధుల జమ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఇవాళ రెండు మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. దేవదయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులుకు కూడా 2023-24 తొలి విడత పెట్టుబడి సాయం రూ.7,500 అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన అన్నదాతలందరికీ ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని.. ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం రైతన్నల చేతుల్లో పెడుతున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదేనన్నారు ముఖ్యమంత్రి జగన్. ఏ వ్యవసాయ భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అండగా ఉంటున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లోని కౌలు రైతులకు భరోసాను అందిస్తున్నామని తెలిపారు. మన దేశంలో ఎక్కడా లేని విధంగా అరణ్య భూములు సాగు చేసుకునే గిరిజనులకు తాము తోడుగా ఉంటున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. పంట వేసే సమయానికి, కోసే టైమ్‌కు అన్నదాతల చేతుల్లో డబ్బులు పడేసరికి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి నష్టపోకుండా వ్యవసాయం చేయగలిగే పరిస్థితి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి జగన్.