స్త్రీ సాధికారత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదు. స్త్రీలు ఆర్థికంగా వృద్ధి సాధించడం కోసం రాజీలేకుండా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలతో పాటు వ్యవసాయ కార్యకలాపాల కోసం రైతన్నలకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని సహకార శాఖ సమీక్షలో సీఎం జగన్ నిర్ణయించారు. సహకార శాఖపై గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు.
సహకార శాఖ మీద నిర్వహించిన సమీక్షా సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి గోవర్దన్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డితో పాటు వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే అన్నదాతలు, మహిళల ఆర్థిక స్థితిగతులు మరింతగా బలపడాలని చెప్పారు. మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలతో పాటు వ్యవసాయ కార్యకలాపాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలన్నారు.
రైతులు, మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలను అందించడం ద్వారా వారిని చేయి పట్టుకుని నడిపించగలుగుతామన్నారు వైఎస్ జగన్. ఈ లక్ష్యసాధనలో ఆప్కాబ్‌తో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లు, ఆర్బీకేలు భాగస్వామ్యం కావాలన్నారు. దీనికి అనుగుణంగా వీటి నెట్‌వర్క్‌ను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఆర్బీకేల రూపంలో ప్రతి గ్రామంలోనూ ఆప్కాబ్‌కు, జిల్లా కేంద్ర బ్యాంకులకు శాఖలు ఉన్నాయన్నారు. సహకార బ్యాంకులకు ఉన్న ఛాన్స్ మరే ఇతర బ్యాంకుకూ లేదన్నారు జగన్. వీటి ద్వారా కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన సూచించారు.