iDreamPost
android-app
ios-app

సీఎం జగన్‌ మంచి మనసు.. వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్‌ ఏర్పాటు

  • Published Sep 27, 2023 | 8:06 AM Updated Updated Sep 27, 2023 | 8:06 AM
  • Published Sep 27, 2023 | 8:06 AMUpdated Sep 27, 2023 | 8:06 AM
సీఎం జగన్‌ మంచి మనసు.. వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్‌ ఏర్పాటు

కష్టం అంటే చాలు.. వెంటనే స్పందిస్తారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా సంక్షేమ పాలన అందిస్తూ.. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. సాయం కావాలి అని కోరితే.. వెంటనే స్పందించి.. బాధితులను ఆదుకుంటారు సీఎం జగన్‌. ఇప్పటికే రాష‍్ట్రవ్యాప్తంగా ఎందరో బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్‌.. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు ఏకంగా హెలికాప్టర్‌ ఏర్పాటు చేశారు. ఆ వివరాలు..

ఈ సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. హెలికాప్టర్‌లో గుండె తరలించి ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో పాటు.. హెలికాప్టర్‌లో గుంటూరు నుంచి తిరుపతికి అధికారులు గుండె తరలించారు.

అసలేం జరిగింది అంటే.. గుంటూరు చెందిన 19 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యి.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. కర్నూలులో ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న అతడికి కట్టా కృష్ణ అవయవాలు దానం చేసేందుకు అతడి కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు.

అయితే గుండెను గుంటూరు నుంచి తిరుపతికి తీసుకురావాల్సి ఉంది. రోడ్డు మార్గంలో తీసుకువెళ్లాలంటే చాలా ఆలస్యం అవుతుంది. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న సీఎం జగన్‌.. వెంటనే స్పందించి గుండె తరలించేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సీఎం జగన్‌ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేసి గుంటూరు నుంచి తిరుపతికి గుండె తరలించారు. గుంటూరు నుండి తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి ‘గుండె’ చేరగా.. రోగికి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. అతడిని బ్రతికించేందుకు జగన్ చూపించిన చొరవపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమలాంటి సాధారణ వ్యక్తి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయించడంపై కుటుంబసభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని తెలిపారు.