iDreamPost
android-app
ios-app

చంద్రబాబు అరెస్ట్.. ఆర్టీసీ సేవలు నిలిపివేత

చంద్రబాబు అరెస్ట్.. ఆర్టీసీ సేవలు నిలిపివేత

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్టు చేశారు. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ కుంభకోణానికి తెరతీశారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో శనివారం తెల్లవారు జామున హైడ్రామా నడిచింది. ఆ కేసులో తన పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు పోలీసులతో వాదనకు దిగారు. అయితే హైకోర్టుకు తాము ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని తెలిపారు. ఆధారాలు చూపాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా.. రిమాండ్ రిపోర్టులో అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, శ్రేణులు పెద్ద యెత్తున చేరుకుని పోలీసులను అడ్డగించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అఖిల ప్రియ,మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానంద రెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టిన అనంతరం ఆయన కాన్వాయ్ లో విజయవాడకు తరలిస్తున్నారు. ఆయనను మూడో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే..చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లోని టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల సేవలను నిలిపివేశారు. టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్నందున.. ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లవచ్చునని భావిస్తూ బస్సులను డిపోలకే పరిమితం చేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అయితే సిటీ సర్వీసులతో పాటు ఇతర సర్వీసులు కూడా పూర్తిగా రద్దయ్యాయి. కొన్ని చోట్ల నడుస్తున్న బస్సులను మధ్యలోనే ఆపి ప్రయాణీకులను దించేసి.. తిరిగి డిపోలకే పంపించేశారు పోలీసులు. పలు నగరాల్లో సిటీ సర్వీసులను కూడా నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రీకాకుళం, విశాఖ పట్నం, అనకాపల్లిలో బస్సులు ముందుకు కదలలేదు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులను వేచి ఉండాలని సూచిస్తున్నారు.