iDreamPost
android-app
ios-app

వారికి ఏపీఎస్​ఆర్టీసీ శుభవార్త.. మొత్తంగా 715 మందికి ఉద్యోగాలు!

  • Author singhj Published - 09:47 AM, Thu - 17 August 23
  • Author singhj Published - 09:47 AM, Thu - 17 August 23
వారికి ఏపీఎస్​ఆర్టీసీ శుభవార్త.. మొత్తంగా 715 మందికి ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర​ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్​ఆర్టీసీ) వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామకాలకు సంబంధించి ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత.. అంటే 2020 జనవరి నుంచి చనిపోయిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టేలా ఆదేశాలు జారీ అయ్యాయ. దీంతో 346 డ్రైవర్లు, 90 కండక్టర్లు, 229 అసిస్టెంట్ మెకానిక్స్, 50 ఆర్టీసీ కానిస్టేబుల్స్ కలిపి మొత్తంగా 715 పోస్టుల్లో నియామకాలు చేపట్టేలా అన్ని జోన్ల ఈడీలతో పాటు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారులకు అడ్మినిస్ట్రేషన్ ఈడీ బ్రహ్మానంద రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

మొదట అన్ని జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కలెక్టర్లు కారుణ్య నియామకాల కింద ఎంపిక చేశారని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. మిగిలిన దరఖాస్తులు ఆర్టీసీ అధికారులకు చేరాయని.. వాటిని పరిశీలించి అర్హులైన వారిని 715 పోస్టుల్లో భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్కారు తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్​ఎంయూఏ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)లు హర్షం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాలకు పచ్చజెండా ఊపినందుకు ఆయా కుటుంబాల వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కారుణ్య నియామకాల విషయంలో అంతకుముందు ఏపీఎస్​ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ నెల మధ్య కాలంలో మరణించిన ఉద్యోగులకు సంబంధించిన కారుణ్య నియామకాలు చేపట్టాలని డిసైడ్ అయింది. చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి జాబ్ ఇచ్చారు. అలా మొత్తంగా 294 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు దక్కాయి. ఇందులో 99 ఆర్టీసీ కానిస్టేబుల్, 99 అసిస్టెంట్ మెకానిక్, 61 కండక్టర్, 34 జూనియర్ అసిస్టెంట్​తో పాటు ఒక డ్రైవర్ పోస్టును భర్తీ చేశారు.