iDreamPost
android-app
ios-app

వీడియో: వరదలో చిక్కుకున్న పిల్లలను.. తల్లికుక్క వద్దకు చేర్చిన పోలీసులు!

వీడియో: వరదలో చిక్కుకున్న పిల్లలను.. తల్లికుక్క వద్దకు చేర్చిన పోలీసులు!

ప్రపంచంలో కెల్లా తల్లిని మించి మరెవరూ ప్రేమించలేరు అంటారు. నిజానికి ఒక ప్రాణికి తల్లికి మించిన దైవం కూడా ఎవరూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ప్రాణాలను లెక్కచేయకుండా మరో ప్రాణికి ప్రాణం పోసేది తల్లే. అయితే మనిషి అయినా మరే ప్రాణి అయినా ప్రేమలో విషయంలో సమానమే. మనిషి ఎలా అయితే తన బిడ్డను కాపాడుకోవాలి అనుకుంటారో అలాగే.. మూగజీవులు కూడా తమ పిల్లలను కాపాడుకోవాలి అనుకుంటాయి. వాటి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ కడుపున పుట్టిన పిల్లను కాపాడుకోవాలి అనుకుంటాయి. వాటి పిల్లలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా.. ఆ తల్లి ప్రాణం విలవిల్లాడిపోతుంది.

అన్ని ప్రాణులతో పోల్చుకుంటే కుక్కలు పిల్లల పట్ల మరింత ప్రేమగా జాగ్రత్తగా ఉంటాయి. అందుకు ఉదాహరణ ఒక ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా వరదలు వచ్చాయి. పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎన్టీఆర్ జిల్లాలో కూడా నందిగామలో వర్షపు నీరు ప్రధాన రహదారి మీదకు వచ్చిన విషయం తెలిసిందే. రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పోలీసులు వరద నీటిలో చిక్కుకున్న వారిని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అక్కడే రోడ్డు మీద ఒక తల్లికుక్క వచ్చే పోయే వాహనాల వెంట పడుతూ ఉంది. చాలాసేపు అక్కడ వారికి అది ఎందుకు అలా చేస్తోందో అర్థం కాలేదు. కానీ, ఎందుకో అక్కడున్న పోలీసులు ఆ కుక్క దగ్గరకు వెళ్లారు. అది పోలీసులను ఒక ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఒక పాడుపడిన ఇల్లు ఉంది.

ఆ ఇంటి చుట్టూ వరద నీళ్లు ఉన్నాయి. అక్కడకు వెళ్లాక పోలీసులకు చిన్న కుక్క పిల్లల అరుపులు వినిపించాయ. ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా.. అక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి. వాళ్లు వెంటనే వాటిని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ కుక్కపిల్లలను తిరిగి ఆ తల్లి వద్దకు చేర్చారు. పోలీసులు చేసిన సాయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులు చేసిన పనిని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. పోలీసులు ఎంతో సహాయం చేశారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మనిషిదైనా, కుక్కదైనా ప్రాణం ఒకటేనని.. పోలీసులు ఆ ప్రాణాలను నిలబెట్టారని కామెంట్ చేస్తున్నారు. ఏపీ పోలీసులకు నెటిజన్స్ సెల్యూట్ చేస్తున్నారు. మీరు ఎంతో గొప్ప పని చేశారు అంటూ వారిని ప్రశంసిస్తున్నారు. కొందరైతే ఈ వీడియో చూసిన తర్వాత తమ కళ్లు చెమర్చాయంటూ కామెంట్ చేస్తున్నారు.