Dharani
AP Jonnagiri Gold Project: ఏపీ, కర్నూలు జిల్లా, జొన్నగిరిలోని బంగారు గనిలో ఈ ఏడాది చివరి కల్లా.. పసిడి ఉత్పత్తి కానుందని సమాచారం. ఆ వివరాలు..
AP Jonnagiri Gold Project: ఏపీ, కర్నూలు జిల్లా, జొన్నగిరిలోని బంగారు గనిలో ఈ ఏడాది చివరి కల్లా.. పసిడి ఉత్పత్తి కానుందని సమాచారం. ఆ వివరాలు..
Dharani
బంగారానికి, భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. మన వారికి పసిడి అంటే ఖరీదైన లోహం మాత్రమే కాదు.. దైవ స్వరూపం.. పైగా అక్కరకు ఆదుకునే నేస్తం కూడా. బంగారం దిగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. మన దగ్గర ఉన్నంత గోల్డ్ నిల్వలు వేరే ఏ దేశంలో లేవు. ధర ఎంత పెరిగినా సరే.. మనవాళ్లు మాత్రం బంగారం కొనుగోళ్లు ఆపరు. తాజాగా అక్షయ తృతీయ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పసిడి కొనుగోళ్లు చేశారని బులియన్ మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. మన దగ్గర బంగారం నిల్వలు పెద్దగా లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే మన దేశంలో పుత్తడి ధర భారీగా ఉంటుంది. మన దగ్గరే పసిడి లభిస్తే రేటు తగ్గుతుందని సామాన్యులు భావిస్తున్నారు. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ ఉండటం. ఇక త్వరలోనే ఇక్కడ బంగారం ఉత్పత్తి కానుందట. ఆ వివరాలు..
ఏపీలోని కర్నూలు జిల్లా, తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ ఏడాది చివరినాటికల్లా బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ అనుంబంధ సంస్థ అయిన జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్.. జొన్నగిరి గోల్డ్ మైన్ వర్క్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మన దేశంలో ప్రైవేటు రంగంలోనే అతిపెద్ద బంగారు గని ఇదే కావడం విశేషం. ఇక సంస్థ.. జొన్నగిరిలో బంగారం తవ్వకాల కోసం ఈప్రాతంలో 250 ఎకరాలకు పైగా భూసేకరణ చెప్పట్టి.. ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం చేపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇక జొన్నగిరి బంగారు గనిలో పసిడి ఉత్పత్త్తికి సంబంధించి.. ఇప్పటికే ప్రయోగాత్మక పనులు ప్రారంభం అయ్యాయి. ఈ మైన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇక్కడ ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ మైన్‌పై రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ వెల్లడించింది.
దీనితో పాటు ఏపీలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ బంగారం గనులు గుర్తించింది ప్రభుత్వం. వాటిని అభివృద్ధి చేసే పనులు సాగుతున్నాయి. వీటిపై ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో ఈ గనులను తమకు అప్పగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం అభ్యర్థన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జొన్నగిరి గనితో పాటు ఈ జిల్లాల్లోనూ బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్‌కు బంగారం గనుల రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.