అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ కి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోస్ చేసింది. అంతేకాక ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని లోకేశ్ కు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14 గా ఉన్న నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. లోకేశ్ బెయిల్ పిటిషన్ ను డిస్పోస్ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ద్వారా భారీ స్కామ్ జరిగిందని సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐఆర్ఆర్ స్కాంలో లోకేశ్ A14గా ఉన్నారు. ఈ స్కామ్ లో ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, పి. నారాయణ పేర్లను చేర్చిన సీఐడీ అధికారులు, ఇటీవలే లోకేశ్ పేరును కూడా చేర్చారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ లో మార్పులు చేసి.. లింగమనేని రమేశ్, హెరిటేజ్ సంస్థలు, నారాయణలు భారీగా లబ్దిపొందారని సీఐడీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ అరెస్ట్ కూడా తప్పదనే వార్తలు వినిపించాయి.
దీంతో లోకేశ్ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హెకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. లోకేశ్ తరపున దుమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు లోకేశ్ బెయిల్ పిటిషన్ ను డిస్పోస్ చేసింది. అంతేకాక ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని కోర్టు.. లోకేశ్ కి తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే లోకేశ్ కు 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇక కోర్టు ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ ఢిల్లీ బయలు దేరింది.