Uppula Naresh
Uppula Naresh
రెండు తెలుగు రాష్ట్రాలను వాన ముసురు వదలడం లేదు. గత వారం రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వానలు ఒక రేంజ్లో దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాలతో ఆంధ్రప్రదేశ్ తడిసి ముద్దయింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలో అయితే ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఆ అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు ఏపీ వ్యాప్తంగా సగటున 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తీవ్ర అల్పపీడన ప్రభావం గురువారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలు ఈ లిస్టులో ఉన్నాయి. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీగా వానలు పడే ఛాన్స్ ఉంది.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు గంటకు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే.. భారీ వర్షాల కారణంగా వరద నీరు రోడ్ల మీదకు వచ్చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా, నందిగ్రామ నియోజకవర్గం ఐతవరం గ్రామంలో నేషనల్ హైవేను తాకుతోంది వరద నీరు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది ఏర్పడింది. వరద నీరు రోడ్ల పైకి వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సరిగ్గా 20 ఏళ్ల కింద ఇదే ప్రాంతంలో వరద నీటి వల్ల రోడ్డు కొట్టుకుపోయిందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: అల్లకల్లోలంగా మారిన కాకినాడ తీరం.. వెనక్కి వెళ్లిన సముద్రం!