ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలిపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిషలు కష్టపడుతున్నారు. విద్యా రంగంలో ఏపీ నంబర్ వన్‌గా ఉండాలని ఆయన అనుకుంటున్నారు. అందుకు కావాల్సిన అన్ని చర్యలను చేపడుతున్నారు. జగన్ సర్కారు తీసుకున్న చర్యలకు తగ్గ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యా రంగంలో ఏపీ వడివడిగా దూసుకెళ్లోంది. తాజాగా ఏపీలో ఇంటర్ చదవే విద్యార్థులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇదే స్కీమును త్వరలో ఇంటర్మీడియట్ విద్యార్థులకూ వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
జగనన్న గోరుముద్ద పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ స్కీమును పొరుగు రాష్ట్రాలు కూడా అనుసరిస్తుండటమే దీనికి నిదర్శనమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు మంత్రి బొత్స. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అమ్మఒడి పథకంతో స్కూల్ డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ అంతా బడిబాట పట్టారని బొత్స చెప్పుకొచ్చారు.
మధ్యాహ్న భోజనం స్కీమ్ కింద చంద్రబాబు హయాంలో రూ.2,729 కోట్లు ఖర్చు చేశారని.. కానీ తమ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలోనే రూ.6,268 కోట్లు ఖర్చు చేశామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ విద్యా సంవత్సరంలో మరో రూ.1,500 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి కనీసం రెండు ఉన్నత పాఠశాలలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారాయన్నారు మంత్రి. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్‌తో విద్యా బోధన అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని బొత్స పేర్కొన్నారు.