వరద బాధిత ప్రాంతాల్లో నేను పర్యటిస్తాను: సీఎం జగన్

వరద బాధిత ప్రాంతాల్లో నేను పర్యటిస్తాను: సీఎం జగన్

ఇటీవల ఏపీలోని పలు జిల్లాలో భారీగా వానలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలకు అనేక గ్రామాలు నీట మునిగాయి. వరదల ధాటికి అనేక ఇళ్లు నీట మునిగాయి. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి ప్రజలు బయట పడుతున్నారు. అలానే వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు. గురువారం వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈక్రమంలోనే తానే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని కలెక్టర్లకు  సీఎం జగన్ తెలిపారు. అలానే ఆగష్టు 7,8తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు.

గురువారం  వరద ప్రభావిత జిల్లాలైన  అల్లూరి సీతారామరాజు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా జరగాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..” ఎక్కడ విమర్శలకు తావులేకుండా చూడాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విపత్తుల సమయంలో అధికారులకు ముందస్తుగానే నిధులను విడుదల చేస్తున్నాము. అవసమైన నిధులను విడుదల చేస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాం.  సహాయ, పునరావాస చర్యలు సమర్థవమంతగా  చేపట్టేలా అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది.

అంతేకాక  పనులు చేయడం కోసం కొంత సమయం కూడా ఇస్తున్నాం.  ఆ తరువాత  నేనే  స్వయంగా వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి.. మీరు చేపట్టిన పనులను పరిశీలిస్తున్నాను. అదే విధంగా ఈ సారి కూడా నేను  వస్తాను.. మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను. ఎక్కడైన చిన్న చిన్నలోపాలు ఉంటే సరి చేసుకుని పటిష్టంగా చేయాలి. నేను అక్కడ పర్యటించినప్పుడు.. ఏ ఒక్కరు కూడా… తమకు న్యాయం జరగలేదని అనకూడదు. తమకు అందాల్సిన ఆర్థిక సాయం అందలేదని ఏ ఒక్క కుటుంబం అనకూడదు. ఏ ఇంట్లోకి అయినా నీళ్లు వచ్చి ఉంటే..ఖచ్చితంగా రెండు వేలు ఇవ్వాలి.

అలా ఇళ్లలోకి వచ్చి ఉండి.. ఎవరికైన రూ. వేలు అందకపోయి ఉంటే.. మరొకసారి పరిశిలించి..వారికి ఆర్థికసాయం అందించాలి. సహాయ శిబిరాల్లో ఉండి తిరిగి ఇంటికి వెళ్లే ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000 ఇచ్చి పంపించాలి. అలానే  వరద కారణంగా కచ్చా ఇళ్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైన ధ్వంసం  అయితే  ఎట్టి పరిస్థితుల్లోను వర్గీకరణ చేయొద్దు. వారందరికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలి. వచ్చే సోమవారం,మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తాను. ఏ జిల్లాలో  పర్యటిస్తాను అనే విషయం సీఎంవో కార్యాలయం మీకు తెలియజేస్తుంది. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆదివారం సాయంత్రలోపు సీఎంవో అధికారులు వెల్లడిస్తారు” అని సీఎం జగన్ తెలిపారు.

ఇదీ చదవండి: యూనివర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్‌!

Show comments