ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర తిరగరాశారు. పాఠశాల విద్యపై స్పెషల్ ఫోకస్ చేసిన ఆయన.. ఈ విషయంలో ఫుల్ సక్సెస్ అయ్యారు. విద్యాబోధన, సంస్కరణల్లో దేశం మొత్తం మీద చూసుకుంటే ఏపీ విధానాలు అత్యుత్తమంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర విద్యాశాఖ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) రిలీజ్ చేసిన అత్యుత్తమ కేటగిరీలో.. దేశంలో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఏపీకి అభినందనలు కూడా తెలిపింది. చదువుకు పెట్టిన పెట్టుబడికి సమీప భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు రానున్నట్లు చెప్పుకొచ్చింది.
అక్షరాస్యతలో అద్భుతంగా ఉంటే అభివృద్ధి సునాయాసమని ఈ సందర్భంగా పీజీఐ పేర్కొంది. పాఠశాల విద్యలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవడంపై రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ఎడ్యుకేషన్ విషయంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. కేవలం విద్యకు సంబంధించే 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులకు అన్ని విధాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు అండగా ఉంటోందన్నారు. అమ్మఒడి, విద్యాకానుక, నాడు-నేడు లాంటి స్కీమ్స్‌తో స్టూడెంట్స్‌కు ప్రభుత్వం దన్నుగా నిలుస్తోందన్నారు.
ఇక, భారత్‌లోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు కోసం ఏపీ సర్కారు ఏకంగా రూ.66,722 కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క జగనన్న అమ్మఒడి స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా, విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా సర్కారు చూస్తోంది. అలాగే మన బడి నాడు-నేడు ప్రోగ్రామ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 15,715 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు, మరమ్మత్తుల పనులు, మరుగుదొడ్ల నిర్వహణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, విద్యుదీకరణ లాంటి మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం.