iDreamPost

చంద్రబాబు అప్పుడేం చేశారు… ఇంతకన్నా దిగజారిపోవడం మీ వల్ల కాదేమో

చంద్రబాబు అప్పుడేం చేశారు… ఇంతకన్నా దిగజారిపోవడం మీ వల్ల కాదేమో

ఏ వంక లేనివాడు డొంక పట్టుకుని వేలాడినట్టుంది ప్రస్తుతం టీడీపీ అధినేత పరిస్థితి. ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఒక చిన్న కారణం కూడా దొరక్కపోవడంతో అడ్డదారులు తొక్కే క్రమంలో ఆయన పూర్తిగా దిగజారినట్టు కనిపిస్తోంది. చివరకు వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా విమర్శలకు పూనుకోవడం ద్వారా పతనం పరాకాష్టకు చేరినట్టు భావిస్తున్నారు. తాజాగా రామతీర్థం ఘటనను ఉపయోగించుకుని రాజకీయాల్లో మతాల ప్రస్తావనకు ఆయన సిద్ధపడిపోయారు. తాను లౌకిక వాదినని, తమ పార్టీ లౌకికపార్టీ అంటూ గతంలో చెప్పిన మాటలన్నీ తీసి గట్టున పెట్టేశారు. ముఖ్యమంత్రి మతం మీద, ఆయన నమ్మకాల మీద విమర్శలకు పూనుకున్నారు. అంతటితో సరిపెట్టకుండా అధికారుల మీద మతం కోణంలో విమర్శలకు పూనుకున్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారులనే ఇప్పుడు మతం పేరుతో తప్పుబడుతున్నారు.

ఏ విషయంలోనయినా వ్యక్తులను విమర్శించేటప్పుడు వారి సామర్థ్యాన్ని లేదా నిబద్ధతను నిలదీయడం అవసరం. ఏ పనిలో అయినా ప్రజాకాంక్షకు భిన్నంగా ప్రశ్నించడం కీలకం. కానీ చంద్రబాబు దానికి భిన్నమైన దారిలో వెళుతున్నారు. మతం చూసి మీరు మంచి వాళ్లు కాదనే సర్టిఫికెట్లు ఇచ్చే పని ప్రారంభించారు. రామతీర్థం కేసుపై తాజాగా ఆయన పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దానికి నిదర్శనంగా ఉన్నాయి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో పాటుగా విజయనరగం ఎస్పీ కూడా క్రైస్తవులేననే కువ్యాఖ్యలు చంద్రబాబు నుంచి రావడం గమనిస్తే ఎంతగా విలువలు వదిలేశారో అర్థమవుతుంది.

చంద్రబాబు పాలనలో గౌతమ్ సవాంగ్ విజయవాడ కమిషనర్ గా పనిచేశారు. స్వయంగా చంద్రబాబు కూడా ఆయన పనితీరుని అభినందించిన దాఖలాలున్నాయి. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఎస్సీ గా ఉన్న రాజకుమారి రాజమహేంద్రవరం ఎస్సీగా పనిచేశారు. అప్పట్లో ఆమె ప్రవేశపెట్టిన మహిళా రక్షణదళం జాతీయంగానూ మంచి పేరు గడించింది. షీ టీమ్స్ ద్వారా రాజకుమారి చొరవకు మంచి గుర్తింపు దక్కింది. సునీల్ కుమార్ కూడా వివిధ బాధ్యతల్లో సమర్థవంతమైన అధికారిగా పోలీసు విభాగంలో మంచి పేరు గడించారు. అలాంటి అధికారుల మీద గతంలో తాను ప్రశంసించిన వారినే ఇప్పుడు పనిగట్టుకుని ఫలానా మతస్తులంటూ వేలెత్తిచూపడం విస్మయకరంగా మారింది. బాబు విష ప్రచారాలు ఎంత స్థాయికయినా చేరుతాయనడానికి సాక్ష్యంగా మారుతున్నాయి.

రామతీర్థం విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉంది. నేరస్తులను పట్టుకునే పని ప్రారంభించింది. దానికి అనుగుణంగా అనుమానితులను ప్రశ్నిస్తోంది. అందులో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తల పాత్ర బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. అత్యంత ఎత్తులో ఉన్న కొండ మీదకు అర్థరాత్రి సమయంలో వెళ్లి, ఇంత అలజడికి కారణమయిన వారి అసలు గుట్టురట్టు అవుతందనే భయం బాబులో ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రంలో మత విద్వేషాలు పెంచే ప్రయత్నాలు ప్రజల ముందు రుజువయితే తమ బండారం బయటపడుతుందనే బాబు లో ఇంత అసహనం కనిపిస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏపీలో రాజకీయ నేతల మతం అంశాలు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. తాజాగా అవి చంద్రబాబు పుణ్యాన అధికారులు, దిగువ స్తాయి సిబ్బంది వరకూ చేరుతున్నాయి. ఇది సమాజాన్ని విభజించే ప్రక్రియగా టీడీపీకి, ఇతర విపక్షాలకు ఎప్పటికి అర్థమవుతుందన్నది అనుమానమే. పైగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యక్తిగత మత విశ్వాసాలను అడ్డుకునే ప్రక్రియగా కూడా చూడాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి