iDreamPost

కొత్త ట్రెండుకు దారి తీస్తున్న టాక్ షోలు

కొత్త ట్రెండుకు దారి తీస్తున్న టాక్ షోలు

ఒకప్పుడు అంటే దూరదర్శన్ కాలంలో లేదా శాటిలైట్ విప్లవం వచ్చిన మొదట్లో ఇంటర్వ్యూలంటే ఒకరకమైన మూస ఫార్ములాని ఫాలో అయ్యేవి. యాంకర్లు సాధారణ వ్యక్తులు కావడంతో అవతల సెలబ్రిటీ చెప్పేదాని మీదే ప్రేక్షకుల ధ్యాస ఉండేది. కానీ టాక్ షోలు వచ్చాక వీటి స్వరూపమే మారిపోయింది. రెండు పక్కలా మనకు ఇష్టమైన స్టార్లు ఉన్నప్పుడు అంతకన్నా కిక్ ఇచ్చేది ఏముంటుంది. రానా నెంబర్ వన్ యారి షో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సమంతా సామ్ జామ్ తో ఏదో గట్టిగానే ట్రై చేసింది కానీ ఆహా యాప్ ఎంత ఖర్చు పెట్టి తీసినా, చిరంజీవి, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళను తీసుకొచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం రాబట్టుకోలేకపోయింది.

ఈటీవీలో ఆలీ నిర్వహించే అలీతో సరదాగా మాత్రం మంచి రేటింగ్స్ తో సాగుతోంది. టీవీలో కన్నా యుట్యూబ్లో దీనికి మిలియన్ల వ్యూస్ వచ్చి పడుతున్నాయి. దశాబ్దాల అనుభవం ఉన్న పేరు మోసిన కమెడియన్ షో కావడంతో ఎక్కడెక్కడో కనిపించకుండా పోయిన నిన్నటి తరం నటీనటులు దీని పుణ్యమాని దర్శనం ఇస్తున్నారు. అప్పట్లో మంచు లక్ష్మి కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలానే చేసింది కానీ పేరు తెచ్చింది మాత్రం ఒకటి రెండే. ఇప్పుడు తాజాగా ఆహా బాలకృష్ణని రంగంలోకి దింపడం ఆల్రెడీ సెన్సేషన్ అయ్యింది. పరిమిత ఎపిసోడ్లు ఉండే ఈ టాక్ షోకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడన్న న్యూస్ కొత్తగా వచ్చిన అప్ డేట్

ఇదో మంచి ట్రెండ్ అనే చెప్పొచ్చు. సినిమాలతో పాటు ఇలాంటి కంటెంట్లను ఓటిటిలు ప్లాన్ చేసుకున్నప్పుడు మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ కూడా ఇదే తరహాలో ఓ షో ప్లాన్ చేసిందనే టాక్ వచ్చింది కానీ ఇప్పటికైతే దాని తాలూకు వివరాలు బయటికి రాలేదు. మొత్తానికి చిన్ని తెరపై చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని, రానా, సమంతాల తర్వాత ఇప్పుడు బాలయ్య కూడా రంగంలోకి దిగబోతున్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని ఓటిటి కొత్త యాప్స్ రాబోతున్నాయి. ఇంకెలాంటి కార్యక్రమాలు తీసుకొస్తారో ఎలాంటి క్రియేటివిటీ చూపిస్తారో వేచి చూడాలి. వీటికి రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉంటున్నాయి

Also Read : లేటు వయసు హీరోగా భలే ఆఫర్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి