iDreamPost

భారత విజయం లాంఛనమేనా???

భారత విజయం లాంఛనమేనా???

నేడు పూణే వేదికగా భారత్, శ్రీలంకల మధ్య మూడో టి20 మ్యాచ్ జరగనుంది.కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిన భారత జట్టు,శ్రీలంకను ఈ మ్యాచ్లో ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంది.భారత ఆటగాళ్లు సమిష్టిగా బ్యాటింగ్,బౌలింగ్ విభాగాలలో రాణిస్తుండటంతో శ్రీలంకకు విజయంపై పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ గౌరవప్రదమైన పోటీ ఇవ్వాలని భావిస్తుంది.

అయ్యర్ రాణింపుతో తీరిన నాలుగో స్థానం సమస్య:

బ్యాటింగ్ టాప్ ఆర్డర్ లో ఒత్తిడిలో ఉన్న ఓపెనర్ ధావన్ మినహా అందరు సూపర్ ఫామ్ లో ఉండడంతో లంకా బౌలర్లు భారత బ్యాట్స్ మెన్ల పరుగుల దాహమును అడ్డుకోవడం అసాధ్యం అనిపిస్తుంది.గత డిసెంబర్లో జరిగిన వెస్టిండీస్ సిరీస్ నుంచి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ రెండో టీ20 లో కూడా రాణించి ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.

ఆకట్టుకుంటున్న యువ బౌలర్లు:

షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్ బౌలర్ల స్థానంలో రెండవ టి-20లో ఆడిన యువ పేసర్లు భారత స్పిన్ పిచ్లపై చెలరేగి పోయారు. బౌలర్లు నవదీప్ సైని వేగముతో,శార్దూల్ టాకూర్ వైవిధ్యంతో అంచనాలు మించి యార్కర్లు,షార్ట్ పిచ్ బంతులతో విరుచుకుపడి లంక బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిచారు.గాయం నుండి కోలుకొని మూడు నెలల తర్వాత ఆడుతున్న స్పీడ్ స్టార్ బుమ్రా త్వరగా బౌలింగ్ లయ అందుకుంటే లంక బ్యాట్స్మెన్ ల కష్టాలు రెట్టింపు అవుతాయి.హార్దిక్ పాండ్యా గైర్హాజర్ తో ఆల్ రౌండర్ కోటాలో జట్టులో స్థానం సంపాదించిన శివం దూబే బౌలింగ్ సేవలను ఈ మ్యాచ్లో కెప్టన్ కోహ్లీ ఉపయోగించనున్నారు.గత మ్యాచ్లో రాణించని స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజాకు స్థానం కల్పించాలని జట్టు యాజమాన్యం సమాలోచనలో ఉంది.

దిద్దుకోవలసిన క్యాచింగ్ లోపాలు:

గత ఏడాది చివర జరిగిన బంగ్లాదేశ్,వెస్టిండీస్ సిరీస్ లలో భారత్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలు తగ్గినప్పటికీ క్యాచ్ లు జారవిడిచే అలవాటు రెండో టీ20 లో కూడా కొనసాగింది.కీలక సమయాలలో జారవిడిచిన క్యాచ్ లే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.విజయావకాశాలు దెబ్బతినకుండా భారత ఆటగాళ్లు మెరుగైన గ్రౌండ్ ఫీల్డింగ్,నాణ్యమైన క్యాచింగ్ చెయ్యాలని జట్టు యాజమాన్యం కోరుకుంటుంది.

లంకకు లక్కీ గ్రౌండ్ పూణే:

భారత శ్రీలంకల మధ్య జరిగిన చివరి పది టీ20 మ్యాచ్ లలో భారత్ 9 గెలవగా, ఓడిన ఒక్క మ్యాచ్ కు వేదిక పూణే స్టేడియం కావడం విశేషం. 2016 లో ఇరు జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్ లో భారత్ పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది.మలింగ నాయకత్వంలో అనుభవ లేమితో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఆటగాళ్లకు ఈ రికార్డు ఒక్కటే ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది.

మరో ఘనతకు ఒక్క పరుగు దూరంలో కోహ్లీ:

అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ వహించిన 168 మ్యాచ్‌లలో కోహ్లీ మొత్తం 10,999 పరుగులు సాధించాడు. నేటి మూడో టీ20 మ్యాచ్‌లో మరో పరుగు సాధిస్తే కోహ్లీ 11 వేల పరుగులు అత్యంత వేగంగా చేసిన కెప్టెన్ గా రికార్డు సాధిస్తాడు.ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 11 వేల పరుగులు ఐదుగురు కెప్టెన్లు మాత్రమే చేశారు.రికీ పాంటింగ్,గ్రీమ్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోనీ, ఆలన్ బార్డర్ ఈ ఘనత సాధించారు. మరో పరుగు సాధిస్తే కోహ్లీ కూడా వారి సరసన చేరి ఆరో కెప్టెన్ గా నిలవడంతో పాటు,భారత్ కెప్టెన్లలో రెండో వాడిగా రికార్డులలో స్థానం సంపాదిస్తాడు.

అగ్రస్థానానికి వికెట్ దూరంలో బుమ్రా:
రేపటి మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొడితే భారత్ తరపున టీ20 లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలుస్తాడు.2016 లో ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లలోకి అడుగుపెట్టిన బుమ్రా 43 మ్యాచ్ ఆడి యాభై రెండు వికెట్లు పడగొట్టి ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, లెగ్ స్పిన్నర్ చాహల్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కొనసాగుతున్నాడు 52 వికెట్ల మైలురాయిని చాహల్ 36 మ్యాచ్లలో సాధించగా,అశ్విన్ 46 మ్యాచ్లలో అందుకున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి