iDreamPost

చరిత్ర సృష్టించినా పట్టించుకోరా? ఇండియా అంటే క్రికెట్‌ ఒక్కటే కాదు!

  • Published Aug 28, 2023 | 2:48 PMUpdated Aug 28, 2023 | 2:48 PM
  • Published Aug 28, 2023 | 2:48 PMUpdated Aug 28, 2023 | 2:48 PM
చరిత్ర సృష్టించినా పట్టించుకోరా? ఇండియా అంటే క్రికెట్‌ ఒక్కటే కాదు!

భాతరదేశంలో క్రికెట్‌ను ఒక మతంగా భావిస్తారనే నానుడి ఉంది. నిజానికి ఇది వందశాతం వాస్తవం. ఇండియాలో రెండు విషయాలకు విశేష ఆదరణ ఉంటుంది ఒకటి సినిమా అయితే.. రెండోది నిర్మోహమాటంగా క్రికెట్టే. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను ఆదరించే దేశాల సంఖ్య చాలా తక్కువైనప్పటికీ.. అనేక దేశాల ప్రజలకు అసలు క్రికెట్‌ అంటే కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పటికీ.. మన దేశంతో పాటు పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, శ్రీలంక వంటి దేశాల్లో క్రికెట్‌కు భారీ క్రేజ్‌ ఉంది. దీనికి ప్రధాన కారణం.. క్రికెట్‌ ఇంగ్లండ్‌లో పుట్టడం.. బ్రిటీష్‌ ప్రభుత్వం పరిపాలించిన దేశాల్లో క్రికెట్‌ వ్యాపించడం, ఆదరణ పొందడం జరిగింది. క్రికెట్‌ను విపరీతంగా ఆరాదించే దేశాలన్నీ దాదాపు బ్రిటీష్‌ రూల్‌లో ఉన్నవే. బ్రిటీష్‌ వాళ్లు మన దేశంలో కొంతమంది సంపన్నులకు క్రికెట్‌ నేర్పించడంతో భారతీయులకు కూడా క్రికెట్‌ వచ్చేసింది. అది నరనరాల్లో ఎక్కేసింది. ఇంగ్లండ్‌ తరఫున భారతీయులు కూడా క్రికెట్‌ ఆడిన సందర్భాలు ఉన్నాయి.

అయితే.. స్వంతంత్ర వచ్చిన తర్వాత ప్రపంచ ముందు ఇండియా ప్రతిష్ట పెరిగేందుకు క్రికెట్‌ కూడా కారణంగా నిలిచిందనే విషయం ఒప్పుకోవాలి. కానీ, అదే సమయంలో ఇండియా అంటే క్రికెట్‌ ఒక్కటే కాదనే విషయాన్ని సైతం చాలా మంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. దేశంలో క్రికెట్‌కు లభిస్తున్న ఆదరణపై ఎవరికీ ఎలాంటి ఫిర్యాదులేవు. కానీ, మిగతా క్రీడలకు అన్యాయం జరుగుతుందనే విషయం మాత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిన విషయం. క్రికెట్‌ అనే మర్రిచెట్టు నీడలో చాలా క్రీడలకు గుర్తింపు కూడా కరువు అవుతోంది. ఇది దేశానికి చాలా పెద్ద నష్టం చేస్తోంది. ఎలాగంటే..? 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జావిలియన్‌ త్రోలో భారత్‌కు బంగారు పతకం అందించిన నీరజ్‌ చోప్రా తాజాగా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచాడు. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన తొలి భారతీయుడిగా నీరజ్‌ చోప్రా నిలిచాడు.

ఇదేదో సాధారణ విజయం కాదు.. ఒక చరిత్ర సృష్టించాడు. కానీ, నీరజ్‌ చోప్రాకు దక్కాల్సినంత గుర్తింపు దక్కడం లేదు. చాలా మంది ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నీరజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నా.. నిజానికి అంతకంటే ఎక్కువ గుర్తింపుకు నీరజ్‌ అర్హుడు. ఒక్క నీరజ్‌ అనే కాదు.. చాలా మంది భారతీయ అథ్లెట్‌కు కూడా దక్కాల్సినంత గుర్తింపు దక్కడం లేదు. నిన్నమొన్న భారత క్రికెట్‌ జట్టులోకి వచ్చిన ఆటగాడి గురించి అందరికీ తెలుస్తుంది కానీ, కొన్నేళ్లుగా శ్రమిస్తూ.. దేశానికి బంగారు పతకాలు అందిస్తున్న ఆటగాళ్ల గురించి మాత్రం చాలా కొంది మందికే తెలుస్తుంది. గుర్తింపులో వస్తున్న ఈ తేడా అంతిమంగా దేశానికి చేటు చేస్తోంది. ఎంత సాధించినా గుర్తింపు దక్కని క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు భవిష్యత్తు తరం ముందుకు రాదు. దాంతో ఒలింపిక్స్‌, ఏషియన్‌ గేమ్స్‌, వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ లాంటి ఆటల్లో మన దేశం ఇంకా వెనుకబడిపోతుంది. జనాభాలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న భారత్‌.. ఒలింపిక్‌ పతకాల్లో మాత్రం వెనుకబడి ఉంటుంది. ఈ పరిస్థితి మారాలంటే.. మన దేశంలో క్రికెట్‌ను మాత్రమే కాకుండా మిగతా క్రీడలను కూడా పట్టించుకోవాలి, ప్రొత్సహించాలి. సగటు భారతీయుడిగా ఇది మనందరి బాధ్యత. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూంపలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఒకే ఓవర్‌లో 4 సిక్సులు.. అందులో మూడు 100 మీటర్లపైనే..! ఇదీ పొలార్డ్‌ పవర్‌..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి