iDreamPost

ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులను తొలగించాలని దేశ అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రిం ఈ మేరకు పై విధంగా తీర్పు వెలువరించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉందన్న సుప్రిం నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఆదేశించింది. లేకుంటే కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. రంగులు తొలగించకుండా మళ్లీ మరో రంగు జత చేసి జీవో తీసుకురావడంపై సుప్రీం ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేశారంటూ.. వాటిని తొలగించాలని పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయంపై పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు ఆ రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా మరో రంగు జోడిస్తూ ఆయా రంగులకు అర్థాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తెచ్చింది. అయితే దీనిపై కూడా హైకోర్టును మళ్లీ ఆశ్రయించిన పిటిషన్‌దారులు.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆ రంగులను తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రిం కోర్టు తోసిపుచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి