iDreamPost

సిబిఐ కి సుగాలి ప్రీతి కేసు.. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్

సిబిఐ కి సుగాలి ప్రీతి కేసు.. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్

రాష్ట్ర వ్యాప్తంగా 2017లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి బాయ్‌ కేసులో పురోగతి వచ్చింది. ప్రీతిబాయ్‌ కేసును సీబీఐ అప్పగిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం జీ.ఓ నెంబర్‌ 37ను విడుదల చేసింది. 2017 ఆగస్టు 19న కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ప్రీతిబాయ్ మృతి చెందిన విషయం తెలిసిందే.

స్కూల్‌ యాజమాన్యమే అత్యాచారం చేసి, తమ బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. ఇటీవల ప్రీతిబాయ్‌ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ప్రీతిబాయ్‌ కేసును సీబీఐ అప్పగించాలని కోరారు. వారికి సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రీతి కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై ప్రీతిబాయ్‌ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

కర్నూలు లక్ష్మీ గార్డెన్ లో నివాసం ఉంటున్న సుగాలి రాజు నాయక్, పద్మావతిల కుమార్తె 14ఏళ్ళ సుగాలి ప్రీతి. తెలుగుదేశం నేత అయిన వి.జనార్ధన రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో 10వ తరగతి చదివేది, 2017 ఆగస్టు 19న ఫ్యాన్ కి ఉరి వేసుకుని కనిపించింది , స్కూల్ యాజమాన్యం ఆత్మహత్య అనగా.. స్కూల్ అధినేత కొడుకులు (హర్ష వర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి)లు అత్యాచారం చేసి చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు

కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పొస్టూమార్టం చేసిన డాక్టర్ శంకర్ ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో బాలికపై అత్యచారం జరిగిందని చెప్పారు , పాథాలజి హెచ్.ఒ.డి డాక్టర్ బాలేశ్వరి కూడా ఆగస్టు 21న ఇచ్చిన రిపోర్టులో అత్యాచారం జరిగిందనే చెప్పారు. దీంతో ప్రీతి తల్లితండ్రులు కాలేజీ యాజమాన్యం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నిందితులపై పోలీసు వాళ్ళు పోక్సో సెక్షన్ 302, 201, యస్.సి, యస్.టి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పై విచారణకు కలక్టర్ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. ఈ కమిటీ కూడా విద్యార్ధినిపై లైంగిక దాడి చేసి హత్య చేశారని రిపోర్టు ఇచ్చింది. సాక్ష్యాలు ఇలా పక్కాగా ఉన్నా అరెస్టు అయిన నిందితులకి 23 రోజులకే బెయిల్ వచ్చింది.

నిందితులకి తెలుగుదేశం నేత, నంద్యాల లోక్ సభ అభ్యర్థి మాండ్ర శివానంద రెడ్డి అండగా నిలబడి కేసుని నీరుకార్చే ప్రయత్నం అడుగడుగునా చేశారని, మాండ్ర శివానంద రెడ్డి నిందితులని తన ఇంట్లో పెట్టుకుని కాపాడారనే ఆరోపణలు ఉన్నాయి.కేసుని నీరు కార్చేందుకు తెలుగుదేశం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో సుగాలి ప్రీతి తల్లి దండ్రులు జాతీయ మానవహక్కుల కమీషన్ ను ఆశ్రయించారు, వారి విజ్ఞప్తి మేరకు కమీషన్ చెప్పటంతో రాష్ట్ర ప్రభుత్వం కేసును సి.ఐ.డి కి అప్పగించింది, అయినా దర్యాప్తులో జాప్యం జరుగుతూ వచ్చింది. రాజకీయ నేతల ఒత్తిళ్ళతోనే కేసులో ఇంత జాప్యం జరుగుతుందని కావున కేసుని సి.బి.ఐ కి అప్పగించాలని మళ్ళీ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. 2017 ఆగస్టు 18న స్కూల్ యాజమాన్యం కొడుకులు అక్కడ మందు పార్టీ చేసుకున్నారని పలు నివేదికలలొ పేర్కొన్న అంశాన్ని కూడా కోర్టు దృష్టికి ప్రీతి తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు. తాగాజా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐ కి అప్పగించడంతో విచారణ వేగవంతంగా జరిగే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి