iDreamPost

వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఏడేళ్ల జైలు…

వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఏడేళ్ల జైలు…

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా వ్యాధి సోకిన వారిని బాగు చేయడానికి వైద్యులు రేయింబవళ్లు వైద్యం చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ కొందరు మాత్రం తమకు వైద్యం చేయడానికి వస్తున్న వైద్య సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. ఇలా వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఒక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు 1987 నాటి అంటురోగాల చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం ముద్ర వేసింది. ఇకపై ఎవరైనా వైద్యులపై దాడికి పాల్పడితే కేసు తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష,మరియు రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ దాడి జరిగినప్పుడు వైద్య సిబ్బంది వాహనాలు,మరియు ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఆస్తి నష్టం సంభవిస్తే మార్కెట్‌ విలువ ప్రకారం లెక్కించి అంతకు రెట్టింపు మొత్తాన్ని నిందితుల నుంచి వసూలు చేసేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.

కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాకు వివరించారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఆర్డినెన్స్‌ అమల్లోకి రానుంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద కరోనా బాధితులకు చికిత్స అందించనున్నట్లు, కరోనాపై పోరుకు రూ.15వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకాష్ జావాడేకర్ తెలిపారు. కరోనా విధుల్లో ఉన్న అన్ని రకాల సిబ్బందికి రూ.50 లక్షల వరకు వైద్య బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకాష్ జావడేకర్ మీడియాతో వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి