iDreamPost

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రగతి రథం పరుగులెప్పుడు..?

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రగతి రథం పరుగులెప్పుడు..?

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవల పునఃప్రారంభం ఇప్పట్లో జరిగేలా కనిపించడంలేదు. కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22వ తేదీ నుంచి ఉభయ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులకు బ్రేక్‌ పడింది. అయితే గత నెలలో ఆర్టీసీ సేవలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీలు తిప్పడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం అప్పగించింది. దీంతో ఒక రాష్ట్రం బస్సులు మరో రాష్ట్రంలో తిరగాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరైంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సరిహద్దు రాష్ట్రాలకు బస్సుల నడపడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయగా.. కర్ణాటక నుంచి అనుమతి లభించింది. ఆ రాష్ట్రానికి సర్వీసులు కొనసాగుతున్నాయి.

సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువ సర్వీసులు నడిచే తెలంగాణ విషయంలో ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. ఇరు రాష్ట్ర అధికారులు ఇప్పటికే ఒక సారి చర్చలు జరిపినా సర్వీసుల నడపడంపై నిర్ణయం తీసుకోలేదు. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ మేరకు గడచిన బుధవారం సమావేశం జరగాల్సి ఉండగా.. తెలంగాణ అధికారుల్లో ఒకరికి కరోనా సోకిందనే కారణంతో వాయిదా పడింది. ఈ సమావేశం తిరిగి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు. బుధవారం సమావేశం జరిగితే సర్వీసులు తిప్పడంపై కచ్ఛితంగా నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు.

సమావేశం వాయిదా పడడంతోపాటు ఉభయ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సేవలు పునఃప్రారంభం ఇప్పట్లో జరిగేలా కనిపించడంలేదు. ముఖ్యమంగా హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలో రోజుకు దాదాపు వెయి కేసులు నమోదవుతుండగా.. అందులో దాదాపు 80 శాతం కేసులు హైదరాబాద్‌లో నమోదవుతున్నాయి. ఏపీ నుంచి ఎక్కువ సర్వీసులు హైదరాబాద్‌కే నడిచేవి. హైదరబాబాద్‌ తర్వాత ఏపీ వాసులు ఎక్కువగా ఉండే నిజమాబాద్, అదిలాబాద్, బోధన్, నిర్మల్‌ తదితర ప్రాంతాలకు సర్వీసులు నడిచేవి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడవడంపై సందిగ్థత నెలకొంది. ఈ వారంలో బస్సు సర్వీసులు నడుస్తాయని ఆశించిన హైదరాబాద్‌లోని సెటిలర్లకు నిరాశే మిగిలింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి