iDreamPost

ది ఘోస్ట్ రివ్యూ

ది ఘోస్ట్ రివ్యూ

కింగ్ నాగార్జునకు ఒకప్పుడు ఓపెనింగ్స్ ఘనంగా దక్కేవి. అయితే క్రమంగా అది తగ్గుతూ పోవడంతో దాని ప్రభావం ఫ్యాన్ బేస్ మీద కూడా పడింది. అయినా రిస్క్ తీసుకుని కొత్త దర్శకులతో ప్రయోగాలు చేసే స్వభావం మాత్రం ఇంకా అలాగే ఉంది. అందుకే తన రేంజ్ స్టార్ హీరోని డీల్ చేసిన అనుభవం లేకపోయినా ప్రవీణ్ సత్తారుకి అవకాశం ఇచ్చారు. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. నిజానికి గాడ్ ఫాదర్ కన్నా ఈ సినిమా మీదే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కానీ ఓపెనింగ్ డే టాక్స్ చూశాక ఫలితాలు అటుఇటు అయినట్టుగా కనిపిస్తోంది. అది తర్వాత బాక్సాఫీస్ వద్ద తేలుతుంది కానీ ఇంతకీ బొమ్మ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

దుబాయ్ లో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా పని చేసే విక్రమ్(నాగార్జున)కు విపరీతమైన కోపం. బాల్యం తాలూకు విషాద సంఘటన ఒకటి తరచూ కలలో వస్తూ వెంటాడుతుంది. ఓ కిడ్నాప్ కేసుని ఛేదించే క్రమంలో చిన్న పిల్లాడి చావుకు కారణమైన విక్రమ్ బాధ్యతలను నుంచి తప్పుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఇరవై ఏళ్ళ క్రితం విడిపోయిన అక్కయ్య అనుపమ(గుల్ పనాగ్) ఆమె కూతురు అదితి(అనీఖా సురేంద్రన్) ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి వాళ్లకు సెక్యూరిటీగా వెళ్తాడు. అయితే విక్రమ్ అనుకున్నంత తేలిగ్గా పరిస్థితులు ఉండవు. తోబుట్టువు, మేనకోడలిని రక్షించుకోవడం సవాల్ గా మారుతుంది. ఇంతకీ ఘోస్ట్ ఎవరు ఏం చేశాడన్నది తెరమీద చూడాలి

నటీనటులు
వయసు తగ్గని మన్మథుడిగా ఇండస్ట్రీలో పేరున్న కింగ్ నాగార్జునకు ఇందులో పాత్ర కొట్టిన పిండే. ఇదే తరహా క్యారెక్టర్ ని ఇటీవలే వైల్డ్ డాగ్ లో చేశాడు కాబట్టి మరీ కొత్తగా అనిపించదు. పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. అలవోకగా విక్రమ్ గా పరకాయప్రవేశం చేశాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో రిస్క్ చేసి మరీ రియల్ స్టంట్స్ చేసినట్టు టీమ్ చెప్పింది కనక ఆ సాహసానికి మెచ్చుకోవలసిందే. ఈ వయసులో ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు చేసుకోకుండా ఇలాంటివి ఎంచుకోవడం సాహసమే. ఎంత గ్లామర్ కాపాడుకుంటూ వచ్చినా ఏజ్ తాలూకు షేడ్స్ మొహంలో కనిపిస్తున్నా వాటిని ఎక్కువ తలంపుకు రాకుండా చేయడం ఆయనకే చెల్లు

హీరోయిన్ సోనాల్ చౌహన్ మొదటి పాటలో అందాల ఆరబోత, రెండు మూడు ఫైట్లలో హడావిడికి తప్ప పెద్దగా ఉపయోగపడలేదు. కథలో భాగంగా ప్రయాణం చేసింది కానీ దాని వల్ల తనకు వచ్చే ప్రయోజనం పెద్దగా లేదు. నాగ్ అక్కయ్యగా గుల్ పనాగ్ రైట్ ఛాయస్ కాదు. అంతగా ఫిట్ కాలేదనిపిస్తుంది. ఒకవేళ నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారేమో కానీ వేరే ఆప్షన్ అయితే బాగుండేది. మొన్నటిదాకా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న అనీఖా సురేంద్రన్ లుక్స్ తో పాటు యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. జయప్రకాశ్ కొన్ని సీన్లకు పరిమితమయ్యారు. శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ తప్ప పేరున్న తెలుగు ఆర్టిస్టులెవరూ పెద్దగా కనిపించరు

డైరెక్టర్ అండ్ టీమ్

యాక్షన్ ఎంటర్ టైనర్ అంటే నాలుగైదు ఫైట్లు పెట్టేసి, భారీ లొకేషన్లలో ఛేజులు చూపించినంత మాత్రాన అబ్బో అంటూ కళ్ళు తెరుచుకుని చూసే కాలం కాదిది. జాన్ విక్ అయినా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అయినా తలుచుకున్న క్షణాల్లో ఫోన్ లో టీవీలో అందుబాటులోకి వచ్చేసే వేగంతో టెక్నాలజీ పరుగులు పెడుతున్న ట్రెండ్. అలాంటప్పుడు ఈ జానర్ ని ఎంచుకున్నప్పుడు ప్రతిదీ చాలా శ్రద్ధగా రాసుకోవాలి. నాగార్జునకు జాకీ చాన్ లాంటి ఇమేజ్ లేదు. ఏం చేసినా జనం చప్పట్లు కొడుతూ చూసి ఎంజాయ్ చేయడానికి. ఆయన్ని ఎలా వాడుకుంటారనేది దర్శకుల తెలివితేటలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడే ప్రవీణ్ సత్తారు లెక్క కుదరలేదు.

ది ఘోస్ట్ లో మంచి థీమ్ ఉంది. ఎవరు ఎటువైపు నుంచి వచ్చి చంపుతారో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో తనకు మిగిలిన ఇద్దరు కుటుంబ సభ్యులను హీరో కాపాడుకోవడమనే పాయింట్ లో బోలెడంత వెయిట్ ఉంది. కావాల్సిందల్లా ప్రాపర్ నెరేషన్. మొదలుపెట్టడమే ఏడాదిలో పెద్ద ఫైట్ తో స్టార్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు ఆ వెంటనే రొమాంటిక్ సాంగ్ ని చూపించేసి ఎక్కడిక్కడ ఇంప్రెషన్ ని తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. చాలా కీలకమైన సిస్టర్ సెంటిమెంట్ థ్రెడ్ ని సరైన రీతిలో ఎస్టాబ్లిష్ చేయలేకపోవడంతో వాళ్ళ మధ్య అనుబంధాన్ని కొంచెం కూడా ఫీల్ కాలేం. దీంతో ఎమోషన్స్ ఆర్టిఫిషియల్ గా మారిపోయాయి.

ఈ కారణంగానే భావోద్వేగాలు బాగా పండాల్సిన అక్క తమ్ముడి సన్నివేశాలు చప్పగా తేలిపోయాయి. ఇది కాసేపు పక్కపెడితే ది ఘోస్ట్ అని అంత బిల్డప్ ఇచ్చినప్పుడు అతని తాలూకు ఫ్లాష్ బ్యాక్ కానీ, చేసే పనులు కానీ వామ్మో అనిపించేలా ఉండాలి. లేదా తలుచుకుంటే భయమేసేలా విలన్ల అంతు చూసి ఉండాలి. అంతే తప్ప స్క్రీన్ మొత్తం రక్తం నిండిపోయేలా వాళ్ళను కసాకసా నరికినంత మాత్రం ఘోస్ట్ ని బాషా రేంజ్ లో ఎలా రిసీవ్ చేసుకుంటాం. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు ముఖ్యమైన ఎపిసోడ్స్ లో ఇంటెన్సిటీ చూపించిన ప్రవీణ్ సత్తారు దానికి ముందు వెనుకా స్ట్రాంగ్ కంటెంట్ ని సెట్ చేసుకోకపోవడమే ప్రధాన లోపం.

కాసేపు అక్కయ్య తాలూకు కార్పొరేట్ వ్యవహారాలు బాలీవుడ్ రేంజ్ లో బిల్డప్ ఇస్తూ చూపిస్తారు. సడన్ గా పోరాట దృశ్యాలు వచ్చేస్తాయి. ఇదుగో పెద్ద ట్విస్టు అనే రేంజ్ లో ఓ బిల్డప్ సీన్ వస్తుంది. తీరా చూస్తే అదేమో చప్పగా నిరాశ పరుస్తుంది. ఎక్కడైనా గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయేమోనని ఎదురు చూడటంలోనే క్లైమాక్స్ వచ్చేస్తుంది. అలా అని స్క్రీన్ ప్లే వేగంగా పరుగులు పెట్టిందని కాదు. ఏదో రాబోతోందని ఆశపడుతూనే కాలం కరిగిపోతుంది. విలన్లను క్రూరంగా చూపించే ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. బోయపాటి శీను త్రివిక్రమ్ శ్రీనివాస్ ల స్టయిల్ కు మధ్యలో ఉండే ప్రతినాయకుడిని సెట్ చేసే తత్తరపాటులో ఆ గ్యాంగ్ మొత్తం తేలిపోయింది

రాజశేఖర్ మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడే గరుడవేగా లాంటి స్పై థ్రిల్లర్ ని గొప్పగా ప్రెజెంట్ చేసిన ప్రవీణ్ సత్తారు తన చేతికి నాగార్జున లాంటి గ్యారెంటీ స్టార్ దొరికినప్పుడు సరైన రీతిలో కథాకథనాలు వండుకోవాలి. చాలా చోట్ల అవసరం లేని కన్ఫ్యూజన్ కు గురయ్యాడు. విక్రమ్ ఘోస్ట్ గా మారి మాఫియా గ్యాంగ్ అంతు చూసే తతంగం కూడా ఏ మాత్రం ఎగ్జైటింగ్ గా ఉండదు. ఇలాంటి లోపాలు చాలానే ఉన్నాయి. దర్శకుడిని రైటర్ కన్నా ఎక్కువగా టెక్నీషియన్ డామినేట్ చేస్తే ఇలాంటి అవుట్ పుట్టే వస్తుంది. బ్రూస్ లీ జమానా అయితే ఇలాంటివి చెల్లిపోతాయి కానీ స్పెషల్ ఓపీఎస్ లాంటి వెబ్ సిరీస్ లు మైండ్ బ్లాంక్ చేస్తుంటే ఈ టైపు చప్పటి కథలతో గెలిచేదెలా

ఎన్నిసార్లు చెప్పుకున్నా పదే పదే మననం చేసుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఒకటుంది. జానర్ ఏదైనా ఎమోషన్స్, పాత్రల మధ్య కనెక్టివిటీ చాలా ముఖ్యం. దీన్ని విస్మరించి ఎన్ని హంగులు చూపించినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా లాభముండదు. కెజిఎఫ్, విక్రమ్ లలో కేవలం ఎలివేషన్లకు జనం పట్టం కట్టలేదుగా. వాటిలో అమ్మ సెంటిమెంట్, కొడుకు హత్యకు తండ్రి ప్రతీకారం లాంటివి ఆయా దర్శకులు డిజైన్ చేసిన తీరు క్లాస్ మాస్ తేడా లేకుండా అందరితో ఈలలు కొట్టించుకుంది. ప్రవీణ్ లాంటి వాళ్ళు చేయాల్సిన హోమ్ వర్క్ ఇదే. రొటీన్ గా అనిపిస్తే ఆడియన్స్ ఏ స్టార్ నూ లెక్క చేయడం లేదు. ఆచార్య, రాధే శ్యామ్ లు ఎప్పుడో వచ్చినవి కాదుగా.

హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని సైతం మరీ బేసిక్ లెవల్ లో రాసుకోవడం ఈ ఘోస్ట్ లో వచ్చిన మరో చిక్కు. చివరి ఘట్టంలో నాగార్జున పెద్ద రివాల్వింగ్ మెషీన్ గన్ను పట్టుకుని తూటాల వర్షం కురిపిస్తూ ఉంటే యష్, కమల్ హాసన్, కార్తీలు గుర్తుకొస్తే అది మన తప్పు కాదు. ఇంచుమించు ఒకే టైంలో ఈ దర్శకులందరికీ ఒకే తరహా ఆలోచన రావడం మహా విచిత్రం. మొత్తానికి డ్రామా పుష్కలంగా ఉండాల్సిన సబ్జెక్టులో కేవలం యాక్షన్ టెంపోతో నడిపిద్దామనుకున్న ప్రవీణ్ ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. హాలీవుడ్ మూవీస్ నుంచి స్ఫూర్తి తీసుకోవడంలో తప్పు లేదు. కానీ దానికన్నా ముందు ప్రేక్షకుల పల్స్ మీద క్యాలికులేషన్స్ చెక్ చేసుకోవాలి

సంగీతం విషయానికి వస్తే భరత్ సౌరభ్ అందించిన పాటలు సోసోగా ఉన్నాయి. మళ్లీ తలచుకున్నా ఒక్కటీ గుర్తుకురావు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఎలివేట్ అయితే అధిక సందర్భాల్లో కేవలం సౌండ్ తప్ప ఫీల్ లేకుండా ఉంది. ముఖేష్ ఛాయాగ్రహణం మాత్రం దర్శకుడి సూచనలకు అనుగుణంగా హై స్టాండర్డ్ ని ఇవ్వడానికి బాగా కష్టపడింది. తప్పు బట్టడానికి లేదు. ధర్మేంద్ర ఎడిటింగ్ రన్ టైంని క్రిస్పీగానే ఉంచింది. రెండుంపావు గంటలకే అయిపోవడం మంచిదే. మూడు పేరున్న బ్యానర్లు కలిశాయి కాబట్టి ప్రొడక్షన్ పరంగా ఎలాంటి రాజీ కనిపించలేదు. అడిగినంత ఖర్చు బాగానే పెట్టడం స్క్రీన్ మీద కనిపిస్తుంది

ప్లస్ గా అనిపించేవి

నాగార్జున కష్టం
కొన్ని యాక్షన్ బ్లాక్స్
స్టోరీ పాయింట్

మైనస్ గా తోచేవి

బ్యాలన్స్ తప్పిన నెరేషన్
తక్కువ నిడివిలోనూ ల్యాగ్
విలన్ గ్యాంగ్
సంగీతం

కంక్లూజన్

నాగార్జున లాంటి సీనియర్ స్టార్లు ఇప్పటి హీరోల్లా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయలేరు కాబట్టి ఎంచుకునే కథల్లో వైవిధ్యంతో పాటు అవి ఎంతమేరకు ప్రాపర్ గా డిజైన్ చేయబడ్డాయి, జనానికి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయా లేదా సరి చూసుకోవడం చాలా అవసరం. లేదంటే ఆరు పదుల వయసులో మార్కెట్ అంతకంతా తగ్గుతూ వెళ్లడం కొత్త జెనెరేషన్ కి అగ్ర నటుల మీద మరో అభిప్రాయం కలిగించే ప్రమాదం ఉంది. ఆఫీసర్, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ అంటూ పదే పదే స్టయిలిష్ సబ్జెక్టుల హ్యాంగోవర్ లో పడిపోతున్న కింగ్ అర్జెంట్ గా అన్నమయ్యలను కాదు కానీ తనలో మరుగునపడుతున్న బంగార్రాజులను, సోగ్గాళ్లను బయటికి తీయాలి. లేదంటే కష్టమే

ఒక్క మాటలో – నో టేస్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి